![]() |
![]() |

తెలుగునాట `నంది` పురస్కారాల మాట వినగానే.. ఠక్కున గుర్తొచ్చే దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. తన కెరీర్ ఆరంభం నుంచి ఏదో ఒక విభాగంలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రాలు `నంది` అవార్డ్స్ సొంతం చేసుకోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అలా.. `నంది` పురస్కారాలతో వార్తల్లో నిలిచిన గుణశేఖర్ సినిమాల్లో `మనోహరం` ఒకటి. మణిరత్నం `రోజా` (1992) ఛాయలతో సాగే ఈ చిత్రంలో జగపతి బాబు, లయ జంటగా నటించారు. అటు `ఉత్తమ నటుడు`గా జగపతి బాబు, ఇటు `ఉత్తమ నటి`గా లయ.. ఇద్దరు కూడా `నంది` అవార్డ్స్ కైవసం చేసుకున్నారు. అలాగే, `ఉత్తమ తృతీయ చిత్రం`, `ఉత్తమ ఎడిటర్` (ఎ. శ్రీకర్ ప్రసాద్) విభాగాల్లోనూ ఈ సినిమా `నంది` పురస్కారాలు అందుకుంది.
మెలోడీబ్రహ్మ మణిశర్మ స్వరాలకు అనుగుణంగా దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి ఇందులోని పాటలకు సాహిత్యమందించారు. ``పుచ్చ పువ్వుల``, ``చూడచక్కని``, ``గుప్పెడు గుండెల``, ``సరి సరి నటనల``, ``మంగళ గౌరి``, ``భరత మాత``.. ఇలా ఇందులోని గీతాలన్ని మెలోడీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఎం.ఆర్. సి అండ్ మెలోడీ కంబైన్స్ పతాకాలపై ముళ్ళపూడి బ్రహ్మానందం, సుంకర మధుమురళి నిర్మించిన `మనోహరం`.. 2000 మే 13న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది. కాగా, నేటితో ఈ చిత్రం 22 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |