![]() |
![]() |

ఇటీవల టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు 'పుష్ప: ది రైజ్', 'ఆర్ఆర్ఆర్' సంచలన విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ వస్తోంది. అదే యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా 'మేజర్' రూపొందుతోంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రాగా.. ట్రైలర్ దానికి మించి గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది.
'మేజర్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చిన్నప్పటి నుంచి సైనికుడు అవ్వాలనే లక్ష్యంతో ఉన్న సందీప్(అడివి శేష్).. తన తల్లిదండ్రులు భయపడుతున్నా దేశం కోసం ఆర్మీలో చేరతాడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్, డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "వాడికి ఒక మంచి కొడుకుగా ఉండటం కంటే.. ఒక మంచి భర్తగా ఉండటం కంటే.. సోల్జర్ గా ఉండటం అవసరం", "నా జీవితాన్ని తీసుకోవచ్చు గానీ నా దేశాన్ని కాదు" వంటి డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడు. 2:28 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ లో చివరి నిమిషం ప్రతి షాట్ గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే టాలీవుడ్ నుంచి మరో సంచలన విజయం నమోదు కాబోతుందని అనిపిస్తోంది.
సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.
![]() |
![]() |