![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది మ్యాజికల్ కాంబినేషన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. వాటిలో `జగదేక వీరుడు - అతిలోక సుందరి`కి ప్రత్యేక స్థానం ఉంది. హిల్ స్టేషన్ టూర్ గైడ్ రాజు (చిరంజీవి)కి, దేవకన్య ఇంద్రజ (శ్రీదేవి)కి మధ్య సాగే అందమైన ప్రేమకథే.. `జగదేక వీరుడు - అతిలోక సుందరి` చిత్రం. చిరు - శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ, అమ్రిష్ పురి విలక్షణ విలనిజం, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, సి. అశ్వనీదత్ నిర్మాణ విలువలు, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు, ఎ. విన్సెంట్ - కె.యస్. ప్రకాశ్ ఛాయాగ్రహణం.. వెరసి `జగదేక వీరుడు - అతిలోక సుందరి` తెలుగునాట ఓ కల్ట్ క్లాసిక్ గా, దృశ్య కావ్యంలా నిలిచిపోయింది.
దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలు వారిన పాటల్లో.. ``అబ్బ నీ తీయని దెబ్బ``, ``యమహో``, ``ప్రియతమా``, ``అందాలలో``, ``మన భారతంలో``, ``ధినక్ తా``, ``జై చిరంజీవ`` ఇలా అన్ని కూడా విశేషాదరణ పొందాయి. `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ కళా దర్శకుడు` (బి. చలం), `ఉత్తమ ఆడియోగ్రాఫర్` (ఎ.ఆర్. స్వామినాథన్), `ఉత్తమ నృత్య దర్శకుడు` (సుందరం మాస్టర్), `ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్` (ఎం. కృష్ణ) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకున్న `జగదేక వీరుడు - అతిలోక సుందరి`.. 1990 మే 9న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ సెన్సేషన్ 32 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |