![]() |
![]() |

సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఇటు డిస్ట్రిబ్యూటర్స్, అటు ప్రభుత్వాలు తగ్గేదేలే అంటున్నారు. టికెట్ ధరల హైక్ కారణంగానే 'ఆచార్య'కు భారీ ఓపెనింగ్స్ రాలేదని, సాధారణ టికెట్ ధరలు ఉండి ఉంటే టాక్ తో సంబంధం లేకుండా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తమైంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి ప్రత్యేక సినిమాలకు కొద్ది రోజుల పాటు హైక్ ఇవ్వడం ఓకే గానీ, స్టార్ హీరోలు నటించిన ప్రతి సినిమాకి హైక్ ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికే విడుదలకు సిద్ధమైన మరో స్టార్ హీరో మూవీ హైక్ లభించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మే 12న విడుదల కానున్న ఈ మూవీకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో హైక్ లభించింది. మొదటి పది రోజుల పాటు టికెట్ కి రూ.45 చొప్పున పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. పెంచిన ధరలతో మల్టీప్లెక్స్ లలో రూ.236, సింగిల్ స్క్రీన్స్ లో రూ.205 గా టికెట్ ధరలు ఉండనున్నాయి. రెమ్యూనరేషన్స్ కాకుండా బడ్జెట్ 100 కోట్లు దాటిన సినిమాలకు మాత్రమే హైక్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇటీవల 'ఆచార్య'కు, ఇప్పుడు 'సర్కారు వారి పాట'కు అనుమతి ఇచ్చింది.

ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా 'సర్కారు వారి పాట'కు గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి వారం రోజుల పాటు ఏసీ థియేటర్స్, మల్టీప్లెక్స్ లలో రూ.30 నుంచి రూ.50 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెంచిన ధరలతో మల్టీప్లెక్స్ లలో రూ.354, సింగిల్ స్క్రీన్స్ లో రూ.212 గా టికెట్ ధరలు ఉండనున్నాయి. అలాగే మొదటి వారం ఉదయం 7 నుంచి అర్థరాత్రి 1 లోపు రోజుకి ఐదు షోలు వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. మే 12 నుంచి మే 18 వరకు ఈ అనుమతులు వర్తిస్తాయి.
టికెట్ ధరల హైక్ కారణంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సినిమాలకు దూరమవుతున్నాయి. సినిమా బాగుందని తెలిస్తే వారం తర్వాత థియేటర్స్ వెళ్లొచ్చు లేదంటే సినిమాకి నెగటివ్ టాక్ వస్తే ఓటీటీలోనో, టీవీలోనో వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారు. మరి ఈ టికెట్ల ధరల పెంపు 'సర్కారు వారి పాట'పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
![]() |
![]() |