![]() |
![]() |

తెలుగు సినిమాకి సరికొత్త గ్లామర్, గ్రామర్ నేర్పిన వైనం.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సొంతం. అలాంటి రాఘవేంద్రరావు దర్శకప్రస్థానానికి బీజం వేసిన చిత్రంగా `బాబు`(1975)కి ప్రత్యేక స్థానం ఉంది. నటభూషణ శోభన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రాఘవేంద్రరావు తండ్రి, ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు కథను అందించగా.. ఆచార్య ఆత్రేయ మాటలు - పాటలు సమకూర్చారు. శోభన్ బాబుకి జంటగా వాణిశ్రీ, లక్ష్మి నటించిన ఈ సినిమాలో గుమ్మడి, మురళీ మోహన్, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రాజబాబు, రావు గోపాల రావు, అరుణా ఇరాని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటల్లో ``ఎన్నెన్ని ఒంపులు ఎన్నెన్ని సొంపులు``, ``ఒక జంట కలిసిన తరుణాన`` విశేషాదరణ పొందగా.. `అయ్యబాబోయ్ అదిరిపోయింది``, ``నా స్నేహం``, ``ఓయమ్మా ఎంతలేసి సిగ్గొచ్చింది`` గీతాలు కూడా రంజింపజేశాయి. మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎల్. కుమార్ నిర్మించిన `బాబు`కి విన్సెంట్ ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, 1975 మే 2న విడుదలై చెప్పుకోదగ్గ విజయం సాధించిన `బాబు`.. నేటితో 47 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |