![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పలు కుటుంబ కథా చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` ఒకటి. శ్రీ రాఘవ (సెల్వ రాఘవన్) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీకి జోడిగా త్రిష నటించగా `కలర్స్` స్వాతి, కె. విశ్వనాథ్, శ్రీరామ్, కోట శ్రీనివాసరావు, సునీల్, రాజ్యలక్ష్మి, వినయ ప్రసాద్, జీవా, ప్రసాద్ బాబు, సుమన్ శెట్టి, హరితేజ, శంకర్ మెల్కొటే, జీవీ సుధాకర్ నాయుడు, జయలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ముమైత్ ఖాన్, మేఘనా నాయుడు ప్రత్యేక గీతాల్లో కనువిందు చేశారు.
యువన్ శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రానికి `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, చంద్రబోస్, కందికొండ, కులశేఖర్ సాహిత్యమందించారు. ``అల్లంత దూరాల``, ``నా మనసుకి``, ``ఏమైంది ఈ వేళ``, ``ఓ బేబి``, ``చెలి చమక్``, ``మనసా మన్నించమ్మా``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. తమిళంలో `నీ యారాడి మోహిని`, బెంగాలీలో `100% లవ్`, భోజ్ పురీలో `మెహందీ లగా కే రఖ్ నా`, కన్నడలో `అంతు ఇంతు ప్రీతి బంతు`, ఒడియాలో `ప్రేమ అదే అక్ష్యర` టైటిల్స్ తో రీమేక్ అయిన `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`కి.. `బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ యాక్టర్` (వెంకటేశ్), `బెస్ట్ డైలాగ్ రైటర్` (గోపీ-రమేశ్) విభాగాల్లో `నంది` పురస్కారాలు - `బెస్ట్ యాక్ట్రస్` (త్రిష) విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డ్ దక్కాయి. శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ నిర్మించిన `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`.. 2007 ఏప్రిల్ 27న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 15 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |