![]() |
![]() |

తెలుగునాట అటు రచయితగానూ, ఇటు దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి త్రివిక్రమ్ కెరీర్ లో `స్వయంవరం` చిత్రంకి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. ఈ సినిమాతోనే రచయితగా తొలి అడుగేశారాయన. కథ, సంభాషణలు అందించి చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. వేణు, లయ హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ సినిమాతోనే దర్శకుడు కె. విజయ భాస్కర్ కూడా కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ చూశారు. యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో కోట శ్రీనివాస రావు, గిరిబాబు, బ్రహ్మాజీ, అలీ, కవిత, సుధ, ఎమ్మెస్ నారాయణ, ఐరెన్ లెగ్ శాస్త్రి, సునీల్, రఘునాథ రెడ్డి, రజిత ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందించిన ఈ చిత్రానికి భువనచంద్ర సాహిత్యమందించారు. ``కీరవాణి రాగంలో``, ``పికాసో చిత్రమా``, ``మరల తెలుపనా ప్రియా``, ``పెళ్ళిచేసుకోరా నాయనా``, ``వినవే చెలి``, ``యారా రా రోయ్``.. ఇలా ఇందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ గాయని` (చిత్ర - మరల తెలుపనా), `స్పెషల్ జ్యూరీ` (వేణు, లయ) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకున్న `స్వయంవరం`.. తమిళంలో `లవ్ మ్యారేజ్` (2001), హిందీలో `క్యా దిల్ నే కహా` (2002) పేర్లతో రీమేక్ అయింది. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట శ్యామ్ ప్రసాద్ నిర్మించిన `స్వయంవరం`.. 1999 ఏప్రిల్ 22న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 23 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |