![]() |
![]() |

చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'ఆచార్య' మూవీకి మహేశ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయాన్ని స్వయంగా మెగాస్టార్ ధ్రువీకరించారు. సిద్ధ అనే పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్న ఈ సినిమా కథ ధర్మస్థల అనే ప్రదేశం నేపథ్యంలో నడుస్తుంది. ఆ ధర్మస్థలలో 'పాదఘట్టం' అనే ఓ పవిత్ర స్థలం ఓ భాగం. ఆ స్థలం గురించి సినిమాలో తన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయనున్నాడు మహేశ్.
ఈ విషయాన్ని శుక్రవారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చిరంజీవి వెల్లడించారు. "ప్రియమైన మహేశ్.. 'ఆచార్య'లో నీ మనోహరమైన గాత్రంతో 'పాదఘట్టం'ను పరిచయం చేసినందుకు ఆనందంగా ఉంది. చాలా ప్రత్యేకమైన తరహాలో ఈ సినిమాలో భాగమైనందుకు థాంక్ యూ. నీ మాట వినడానికి రామ్‌చరణ్ ఎంతగా థ్రిల్ అవుతాడో అభిమానులు, ప్రేక్షకులు కూడా అంతే థ్రిల్ అవుతారని కచ్చితంగా అనుకుంటున్నాను. ఐ లవ్డ్ ఇట్!" అని ఆయన రాసుకొచ్చారు.
చిరంజీవి కుటుంబానికీ, సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబానికీ మధ్య అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. మహేశ్, రామ్‌చరణ్ మధ్య మంచి స్నేహం కూడా ఉంది. చిరు అంటే మహేశ్ చాలా అభిమానం ప్రదర్శిస్తుంటాడు. మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చిరు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే గతంలో పవన్ కల్యాణ్ మూవీ 'జల్సా'లో హీరో క్యారెక్టర్‌ను తన వాయిస్ ఓవర్ ద్వారానే మహేశ్ పరిచయం చేయడం మనకు తెలుసు.
కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'ఆచార్య' మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది.
![]() |
![]() |