![]() |
![]() |
.webp)
రాజకీయాల నేపథ్యంలో తెలుగునాట పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ప్రత్యేకంగా నిలిచే సినిమాల్లో `ప్రస్థానం` ఒకటి. దేవా కట్టా రూపొందించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్.. విమర్శకుల ప్రశంసలను పొందడమే కాకుండా రెండు `నంది` పురస్కారాలను, రెండు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే, దర్శకుడిగా దేవా కట్టాకి మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఇందులో సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్, రూబీ పరిహార్, రష్మీ గౌతమ్, పవిత్రా లోకేశ్, మధుసూదనరావు, వెన్నెల కిశోర్, సురేఖా వాణి, జయప్రకాశ్ రెడ్డి, బాలయ్య, రవిప్రకాశ్, జీవా, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో అలరించారు.
మహేశ్ శంకర్ సంగీతమందించిన ఈ చిత్రానికి వనమాలి, చైతన్య ప్రసాద్, దేవా కట్టా సాహిత్యమందించారు. ఇందులోని ``నీరెండల్లో``, ``మురళీలోలా``, ``నాయుడొచ్చాడోయ్``, ``ఇన్నాళ్ళుగా``, ``పయనమే`` వంటి గీతాలు ఆకట్టుకున్నాయి. `ఉత్తమ తృతీయ చిత్రం`, `ఉత్తమ సహాయనటుడు` (సాయికుమార్) విభాగాల్లో `నంది` అవార్డులను, `ఉత్తమ సహాయనటుడు` (సాయికుమార్), `ఉత్తమ చిత్రం - క్రిటిక్స్` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకున్న `ప్రస్థానం`.. 2019లో అదే పేరుతో దేవా కట్టా దర్శకత్వంలోనే బాలీవుడ్ లో రీమేక్ అయింది. 2010 ఏప్రిల్ 16న విడుదలై జననీరాజనాలు అందుకున్న `ప్రస్థానం`.. నేటితో 12 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |