![]() |
![]() |

వరుసగా రెండు డిజాస్టర్లతో గోల్డెన్ గాళ్ అనే పేరును కోల్పోయింది పూజా హెగ్డే. ఆమె హీరోయిన్‌గా నటించిన ప్రభాస్ సినిమా 'రాధే శ్యామ్', విజయ్ సినిమా 'బీస్ట్' బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో ఆమెను ప్రాజెక్టుల ఎంపికలో శ్రద్ధ వహించమని అభిమానులు కోరుతున్నారు. కాగా తన కెరీర్‌లో ఆమె రెండోసారి స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇదివరకు సుకుమార్ డైరెక్ట్ చేసిన 'రంగస్థలం'లో హీరో రామ్‌చరణ్‌తో కలిసి ఆమె డాన్స్ చేసిన "జిగేల్ రాణి" ఐటమ్ సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది.
ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఫుల్ కామెడీ ఫిల్మ్ 'ఎఫ్ 3'లోనూ స్పెషల్ సాంగ్ చేస్తోంది పూజ. ఈ రోజే ఆ పాట చిత్రీకరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేసింది. పింక్ కలర్ డ్రస్సులో ఫుల్ గ్లామరస్‌గా కనిపిస్తోంది పూజ. డాన్సర్లతో కలిసి ఆమె డాన్స్ చేస్తున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. ఈ సాంగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. దేవి శ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో సోనాల్ చౌహాన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న 'ఎఫ్ 3' మే 27న విడుదలవుతోంది.

![]() |
![]() |