![]() |
![]() |

వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన 'ద కశ్మీర్ ఫైల్స్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ట్రెమండస్ సక్సెస్ సాధించింది. కశ్మీర్ మారణకాండ వెనుక వున్న భయంకర నిజాలను చూపించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇచ్చిన ఉత్తేజంతో 'ద ఢిల్లీ ఫైల్స్' అనే మూవీని తీసేందుకు రెడీ అవుతున్నాడు వివేక్ అగ్నిహోత్రి.
శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించాడు. "ద కశ్మీర్ ఫైల్స్‌ను సొంతం చేసుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. నిజాయితీతో, సిన్సియారిటీతో నాలుగేళ్లు ఆ సినిమా కోసం శ్రమించాం. కశ్మీరీ హిందువులపై జరిగిన మారణకాండ, వారికి జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్యవంతం చేయడం ముఖ్యమనే ఉద్దేశంతోనే ఆ సినిమా తీశాం. ఇప్పుడు నా కొత్త ఫిల్మ్ 'ద ఢిల్లీ ఫైల్స్'పై పనిచేసే టైమ్ వచ్చింది" అని ఆయన రాసుకొచ్చాడు.
'ద కశ్మీర్ ఫైల్స్'.. 1990లో కశ్మీర్ తిరుగుబాటు సమయంలో కశ్మీరీ పండిట్‌లు ఎదుర్కొన్న దురాగతాల కథను చెబుతుంది. ఆ కాలంలో కశ్మీరీ పండిట్లు అనుభవించిన బాధలను హృదయాన్ని కదిలించే రీతిలో చిత్రీకరించాడు వివేక్ అగ్నిహోత్రి. జీ స్టూడియోస్, ఐ యామ్ బుద్ధ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
![]() |
![]() |