![]() |
![]() |

నిజజీవితంలో తండ్రీకొడుకులైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కింగ్ నాగార్జున.. కొన్ని చిత్రాల్లో తెరపైనా అవే పాత్రల్లో కనిపించి అలరించారు. వాటిలో `కలెక్టర్ గారి అబ్బాయి`కి ప్రత్యేక స్థానం ఉంది. నీతి, నిజాయితీకి చిరునామాగా నిలిచే రమాకాంతరావు (ఏయన్నార్) అనే కలెక్టర్ కి, ఆయన తనయుడు రవి (నాగ్)కి మధ్య సాగే సంఘర్షణే.. `కలెక్టర్ గారి అబ్బాయి` చిత్రం. ఇందులో ఏయన్నార్ కి జోడీగా `ఊర్వశి` శారద నటించగా.. నాగ్ కి జంటగా రజిని ఆడిపాడింది. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, వరలక్ష్మి, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు, సుధాకర్, సుత్తి వేలు, పి.ఎల్. నారాయణ, రమాప్రభ, శ్రీలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. గణేశ్ పాత్రో సంభాషణలు సమకూర్చారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడం విశేషం.
చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``బంగారు లేడిని కోరినా``, ``అందమా``, ``నచ్చిన చోట``, ``మన్మథ మన్మథ``, ``సన్నాయి ఆపకు బావ``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ఎస్. ఎస్. క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన `కలెక్టర్ గారి అబ్బాయి`.. 1987 ఏప్రిల్ 9న విడుదలై జననీరాజనాలు అందుకుంది. అలాగే, హిందీలో `కనూన్ అప్నా అప్నా` (దిలీప్ కుమార్, నూతన్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్) పేరుతో బి. గోపాల్ దర్శకత్వంలోనే రీమేక్ అయింది. కాగా, నేటితో `కలెక్టర్ గారి అబ్బాయి` 35 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |