![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి - మెలోడీ బ్రహ్మ మణిశర్మది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా మెప్పించాయి. అలాంటి ఈ కాంబోలో వచ్చిన మొదటి సినిమాగా `బావగారూ.. బాగున్నారా!`కి ప్రత్యేక స్థానం ఉంది. జయంత్ సి. పరాన్జీ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో చిరంజీవికి జంటగా రంభ నటించగా రచన, బ్రహ్మానందం, సత్యనారాయణ, షావుకారు జానకి, పరేష్ రావెల్, కోట శ్రీనివాసరావు, శ్రీహరి, అచ్యుత్, సుధ, ఎమ్మెస్ నారాయణ, జయ ప్రకాశ్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
కథ విషయానికి వస్తే.. రాజు (చిరంజీవి), స్వప్న (రంభ) ప్రేమించుకుంటారు. అయితే, అనూహ్య పరిస్థితుల్లో స్వప్న అక్క సంధ్య (రచన)కి భర్తగా నటించాల్సి వస్తుంది రాజుకి. ఈ క్రమంలో స్వప్న ఇంట్లో రాజుకి ఎదురయ్యే అనుభవాలేంటి? తనను అపార్థం చేసుకున్న స్వప్నకు రాజు మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేదే `బావగారూ.. బాగున్నారా!` సినిమా. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ చిత్రానికి ప్రథమార్ధంలో వచ్చే చిరు - రంభ - బ్రహ్మానందం కామెడీ ట్రాక్, ద్వితీయార్ధంలో వచ్చే చిరు - రంభ - కోట - శ్రీహరి కామెడీ ట్రాక్ ఎస్సెట్ గా నిలిచాయి. అలాగే, చిరంజీవి చేసిన బంగీ జంప్ సీన్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ``ఆంటీ కూతురా``, ``సారీ సారీ``, ``మత్తెక్కి తూగే మనసా``, ``నవమి దశమి``, ``చల్ నేదో గాడీ``.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను రంజింపజేసింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన `బావగారూ.. బాగున్నారా!`.. 1998 ఏప్రిల్ 9న విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా హిందీలో `కున్వారా` (2000), బంగ్లాదేశీ బెంగాలీలో `జమై ససుర్` (2003) టైటిల్స్ తో రీమేక్ అయింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 24 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |