![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణకి అటు కథానాయికగా, ఇటు దర్శకురాలిగా విజయ నిర్మల భలేగా కలిసొచ్చారు. మరీముఖ్యంగా.. విజయ నిర్మల దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు కృష్ణ. అలా అలరించిన సినిమాల్లో `డాక్టర్ - సినీయాక్టర్` ఒకటి. ఇందులో డాక్టర్ గా, సినీ యాక్టర్ గా టైటిల్ రోల్స్ లో నటించడమే కాకుండా.. మరో వేషంలోనూ కనిపించి త్రిపాత్రాభినయంతో అభిమానులను మురిపించారు సూపర్ స్టార్. అలాగే కథానుసారం ఛత్రపతి శివాజీగా కాసేపు కనిపించి మైమరిపించారు.
ఈ చిత్రంలో కృష్ణ కి జంటగా జయసుధ, కవిత నటించగా కైకాల సత్యనారాయణ, నరసింహ రాజు, అల్లు రామలింగయ్య, సుభాషిణి, మమత, సూర్యకాంతం, గీత, పుష్ప కుమారి, కాకినాడ శ్యామల, కాంతారావు, నగేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. నటరత్న నందమూరి తారక రామారావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు, మూవీ మొఘల్ డి. రామానాయుడు అతిథి పాత్రల్లో మెరిసి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``ఏ పేర పిలిచినా``, ``దొరికారు దొరగారు``, ``చిట్టమ్మో``, `రాదారి చెట్టు``, ``తెర తీయగా రాదా``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. కొల్లూరి శ్రీరామచంద్ర మూర్తి, కె.ఎల్. నరసింహులు నిర్మించిన `డాక్టర్ - సినీయాక్టర్`.. 1982 ఏప్రిల్ 9న విడుదలై చెప్పుకోదగ్గ విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |