![]() |
![]() |
.webp)
మార్చి 25 న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మొదటి రోజు 'బాహుబలి-2'కి మించిన కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. మొదటి ఐదు రోజులు అదే జోరు కొనసాగించిన ఆర్ఆర్ఆర్.. ఆరో రోజు, ఏడో రోజు మాత్రం డల్ అయింది. దీంతో మొదట్లో 'బాహుబలి-2' రికార్డులు బ్రేక్ చేసేలా కనిపించిన ఆర్ఆర్ఆర్.. ఇప్పుడసలు కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందా అన్న సందేహం కలుగుతోంది.
రూ.453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ఆర్ఆర్ వారం రోజుల్లో 392.85 కోట్ల షేర్(710 కోట్ల గ్రాస్) రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు 60.15 కోట్ల దూరంలో ఉన్న ఆర్ఆర్ఆర్ మరో రెండు మూడు రోజుల్లో ప్రాఫిట్స్ లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే తెలంగాణలో, రాయలసీమలో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ.. ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రా, ఓవర్సీస్ లోనూ బ్రేక్ ఈవెన్ అందుకోనుంది.
తెలుగు రాష్ట్రాల్లో 191 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే 187.65 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో 77.22 కోట్లు(70 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 37.28 కోట్లు(37 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 73.15 కోట్లు(84 కోట్ల బిజినెస్)తో సత్తా చాటింది. ఓవర్సీస్ లోనూ 73.45 కోట్లు(75 కోట్ల బిజినెస్)తో దూసుకుపోతోంది. ఇక హిందీలో 92 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ వారం రోజుల్లో 65.60 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ అందుకునే లాగానే ఉంది. అయితే సౌత్ లో కొన్నిరాష్ట్రాల్లో మాత్రం ఆర్ఆర్ఆర్ కి గట్టి దెబ్బ తగిలేలా ఉంది.

'బాహుబలి-2' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ భారీ అంచనాలతో విడుదలైంది. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. అయితే మిగతా దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆర్ఆర్ఆర్ కి కలెక్షన్స్ రావట్లేదు.
కర్ణాటకలో 41 కోట్ల బిజినెస్ చేయగా మొదటి వారం 27.75 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 13.25 కోట్లకు పైగా రాబట్టాలి. ఇక తమిళనాడులో 35 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటిదాకా 25.30 కోట్లు రాబట్టి ఇంకా బ్రేక్ ఈవెన్ కి దాదాపు 10 కోట్ల దూరంలో ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ రెండు రాష్ట్రాల్లో బయ్యర్లు స్వల్ప నష్టాలను మూటగట్టుకునే అవకాశముంది. ఏప్రిల్ 13 న 'బీస్ట్', ఏప్రిల్ 14 న 'కేజీఎఫ్-2' విడుదల కానున్నాయి. ఈలోపు కర్ణాటక, తమిళనాడులో ఆర్ఆర్ఆర్ పుంజుకోవాల్సి ఉంది. మరి వీకెండ్ లో ఏమైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |