![]() |
![]() |

భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆర్ ఆర్ ఆర్`. `బాహుబలి` సిరీస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. `ఆర్ ఆర్ ఆర్`పై సర్వత్రా ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. మరీముఖ్యంగా.. తెలుగునాట అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన రాజమౌళి.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వంటి సమకాలీన అగ్ర కథానాయకులతో ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేయడంతో అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది.
ఇదిలా ఉంటే, `ఆర్ ఆర్ ఆర్` దర్శకుడిగా రాజమౌళికి 12వ సినిమా. `స్టూడెంట్ నెంబర్ 1`, `సింహాద్రి`, `సై`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `యమదొంగ`, `మగధీర`, `మర్యాద రామన్న`, `ఈగ`, `బాహుబలి - ది బిగినింగ్`, `బాహుబలి - ది కంక్లూజన్`.. ఇలా ఇప్పటికే జక్కన్న తీసిన 11 సినిమాలు విజయపథంలో పయనించాయి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ సినిమాలన్నింటికీ రాజమౌళి పెద్దన్నయ్య కీరవాణినే సంగీత దర్శకుడు. మరి.. ఇప్పటికే 11 వరుస విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి - కీరవాణి కాంబో.. `ఆర్ ఆర్ ఆర్`తో వరుసగా 12వ విజయం అందుకుని నాలుగో `హ్యాట్రిక్` అందుకున్న రేర్ కాంబినేషన్ గా రికార్డులకెక్కుతుందేమో చూడాలి.
![]() |
![]() |