![]() |
![]() |

మరి కొన్ని గంటల్లో 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం మొదలు కానుంది. ఈ మూవీ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని భావిస్తున్నారంతా. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముందని అంటున్నారు. ఓవర్సీస్ లోనూ ఆర్ఆర్ఆర్ జోరు అదే రేంజ్ లో ఉంది. అమెరికాలో ప్రీమియర్ ప్రీ సేల్స్ తోనే 2.5 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. ఇలా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ జోరు కనిపిస్తుంటే నార్త్ లో మాత్రం ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
'బాహుబలి'తో రాజమౌళి నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించాడు. హిందీలో ఆ సినిమా ఊహకందని కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించింది. అలాంటిది ఇప్పుడు బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'పై హిందీ ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే 25 శాతం టికెట్స్ బుక్ అవ్వలేదు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి నార్త్ లోనూ భారీగా ప్రమోషన్స్ నిర్వహించాడు. ముంబై ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, ఢిల్లీ ఈవెంట్ లో ఆమిర్ ఖాన్ సందడి చేశారు. పైగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్ కీలక పాత్రల్లో నటించారు. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ కి హిందీలో ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కాకపోవడం విశేషం. దీంతో హిందీ రైట్స్ 90 కోట్లకు దక్కించుకున్న బయ్యర్స్ కొంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హిందీలో 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ప్రభంజనం నడుస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటిదాకా 200 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఇప్పటికీ ఎందరో ప్రేక్షకులు ఆ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ ప్రభావం కొంతమేర ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ మీద పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతేడాది డిసెంబర్ విడుదలైన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్' కూడా హిందీలో ఓపెనింగ్స్ అంతగా రాబట్టలేకపోయింది. కానీ పాజిటివ్ టాక్ తో రెండో రోజు నుంచి మంచి కలెక్షన్స్ రాబట్టి వంద కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగే అవకాశముంది. రెండో రోజు నుంచి సినిమా అనూహ్యంగా పుంజుకోవచ్చు అంటున్నారు.
![]() |
![]() |