![]() |
![]() |

'ద కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసి తనూ, తన భర్త నితిన్ రాజు కన్నీళ్లు ఆపుకోలేకపోయామంటూ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది ప్రణీత సుభాష్. సినిమా పోస్టర్‌ను షేర్ చేసిన ఆమె, దాన్ని ప్రతి భారతీయుడూ తప్పకుండా చూడాల్సిన సినిమాగా అభివర్ణించింది. అందరూ ఆ సినిమాని చూడాల్సిందిగా కూడా ఆమె రిక్వెస్ట్ చేసింది. 1990లలో కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న దారుణాలు, దౌర్జన్యాలను వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన 'ద కశ్మీర్ ఫైల్స్' కళ్లకు కట్టినట్లు చూపించింది.
అక్షయ్‌కుమార్, యామీ గౌతమ్ లాంటి సెలబ్రిటీలు ఈ సినిమాని ప్రశంసిస్తూ ఇప్పటికే తమ అభిప్రాయాలను షేర్ చేసుకోగా, లేటెస్ట్గా ఆ లిస్టులో ప్రణీత చేరింది. భర్త నితిన్ రాజుతో కలిసి ఆ మూవీని వీక్షించిన ఆమె, తాము కన్నీళ్లు ఆపుకోలేకపోయామని రాసింది. థియేటర్లలో ఆ సినిమాని చూడాల్సిందిగా తన ఫాలోయర్స్‌ను ఆమె విజ్ఞప్తి చేసింది.
"ఇది ఒక పోస్ట్ అయి ఉండాలి. 30 సంవత్సరాల క్రితం కశ్మీరీ పండిట్లు అనుభవించిన హృదయాలను మెలిపెట్టే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రతి భారతీయ పౌరుడు 'కశ్మీర్ ఫైల్స్' తప్పక చూడాలి. సినిమా పూర్తయ్యేసరికి నా భర్త, నేను కన్నీళ్లు పెట్టుకున్నాం. మీరు ఇప్పటికీ చూడకపోతే దయచేసి చూడండి." అని ఆమె రాసుకొచ్చింది.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన 'ద కశ్మీర్ ఫైల్స్'లో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవీ జోషి, చిన్మయ్ మండ్లేకర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. జీ స్టూడియోస్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
![]() |
![]() |