![]() |
![]() |

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు - స్వరవాణి కీరవాణిది మ్యాజికల్ అండ్ మ్యూజికల్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన చిత్రాల్లో సింహభాగం కమర్షియల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిలో `అల్లరి ప్రియుడు` ఒకటి. సీనియర్ స్టార్ రాజశేఖర్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన ఈ చిత్రంలో అతనికి జోడీగా రమ్యకృష్ణ, మధుబాల కనువిందు చేశారు. మాస్ మహారాజా రవితేజ ఇందులో రాజశేఖర్ స్నేహితుల బృందంలో ఒకరిగా దర్శనమివ్వగా.. రావుగోపాల రావు, మనోరమ, బ్రహ్మానందం, సుధాకర్, శుభ, శ్రీహరి, బాబూ మోహన్, అనంత్, పి. రవిశంకర్, సుత్తి వేలు, చిట్టి బాబు, సారథి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
Also Read: భీమ్లా నాయక్ కి భారీ దెబ్బ.. ఒక్కసారిగా కలెక్షన్స్ డ్రాప్!
కీరవాణి స్వరాలకు వేటూరి, `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి, కీరవాణి సాహిత్యమందించారు. ``అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు``, ``రోజ్ రోజ్ రోజా పువ్వా``, ``ఉత్తరాల ఊర్వశి``, ``చెప్పకనే చెబుతోంది``, ``అందమా నీ పేరేమిటి అందమా``, ``ఏం పిల్లది``, ``ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా``.. ఇలా బాలు, చిత్ర ఆలపించిన ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ఆర్. కె. ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణ మోహన రావు నిర్మించిన `అల్లరి ప్రియుడు`.. కన్నడంలో `చోర చిత్త చోర` (వి. రవిచంద్రన్, నమ్రతా శిరోద్కర్, మాళవిక) పేరుతో రీమేక్ అయింది. అలాగే.. `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ సంగీత దర్శకుడు` విభాగంలో ఇటు `నంది`, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకుని వార్తల్లో నిలిచింది. 1993 మార్చి 5న విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `అల్లరి ప్రియుడు`.. నేటితో 29 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |