![]() |
![]() |

ఛాయాగ్రాహకుడిగా రవి కె. చంద్రన్ ది 30 ఏళ్ళకు పైగా సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఎక్కువగా హిందీ, మలయాళ, తమిళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు రవి. ఆయన పనిచేసిన కొన్ని సినిమాలు తెలుగులోనూ అనువాద రూపంలో సందడి చేశాయి కూడా. అయితే, పాతికేళ్ళ కెరీర్ పూర్తయ్యాకే రవి కె. చంద్రన్ నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన `భరత్ అనే నేను` కోసం తెలుగులో మొదటిసారి పనిచేశారు రవి. 2018లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి తిరు కూడా మరో కెమెరామేన్ గా పనిచేయడం గమనార్హం.
కట్ చేస్తే.. దాదాపు నాలుగేళ్ళ తరువాత మరో తెలుగు చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు రవి కె. చంద్రన్. ఆ చిత్రమే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో సందడి చేసిన `భీమ్లా నాయక్`. శుక్రవారం (ఫిబ్రవరి 26) తెరపైకి వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో విజయపథంలో పయనిస్తోంది. మొత్తమ్మీద.. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి తెలుగునాట రెండు వరుస విజయాలు అందుకున్నారు ఏస్ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్.
![]() |
![]() |