![]() |
![]() |
.webp)
తెలుగునాట సక్సెస్ గ్రాఫ్ ఎక్కువ ఉన్న కథానాయికల్లో చెన్నై పొన్ను సమంత ఒకరు. దాదాపు ఒక తరం అగ్ర కథానాయకులందరితోనూ జోడీకట్టి ఘనవిజయాలు అందుకున్న ఘనత సమంతది. అంతేకాదు.. తెలుగుతో పాటు తన మాతృభాష తమిళంలోనూ స్టార్ డమ్ చూసింది సామ్. అలాంటి సమంతకి ఫిబ్రవరి 26 ఎంతో స్పెషల్. ఎందుకంటే.. సరిగ్గా 12 ఏళ్ళ క్రితం అంటే 2010లో ఇదే ఫిబ్రవరి 26న తన తొలి చిత్రం `ఏమాయ చేసావె` రిలీజైంది.
యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా వెర్సటైల్ కెప్టెన్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామాలో జెస్సీగా కనిపించి ఆకట్టుకుంది సామ్. అంతేకాదు.. సినిమాకి ఓ మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. అలాగే సమాంతరంగా తెరకెక్కిన తమిళ వెర్షన్ `విన్నైతాండి వరువాయా`లో అతిథిగా మెరిసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అదేవిధంగా.. `ఉత్తమ నూతన నటి`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డుతో పాటు `నంది` `స్పెషల్ జ్యూరీ`ని కూడా సొంతం చేసుకుంది.
ఇక స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో రూపొందిన `ఏమాయ చేసావె`లోని గీతాలన్ని కూడా యువతరాన్ని విశేషంగా అలరించాయి. ``కుందనపు బొమ్మ``, ``ఈ హృదయం``, ``వింటున్నావా``, ``ఆకాశం``, ``మనసా``, ``శ్వాసే``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టున్నాయి. ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై ఘట్టమనేని మంజుల, సంజయ్ స్వరూప్ నిర్మించిన `ఏమాయ చేసావె`.. నేటితో 12 వసంతాలు పూర్తిచేసుకుంది. అంటే.. నాయికగా సామ్ కెరీర్ కి పుష్కరకాలం పూర్తయిందన్నమాట.
![]() |
![]() |