Home  »  News  »  'భీమ్లా నాయక్‌' మూవీ రివ్యూ-2

Updated : Feb 25, 2022

సినిమా పేరు: భీమ్లా నాయక్‌
తారాగ‌ణం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి, నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, స‌ముద్ర‌క‌ని
స్క్రీన్‌ప్లే, మాట‌లు: త్రివిక్ర‌మ్‌
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ర‌వి కె. చంద్ర‌న్‌
ఎడిటింగ్: న‌వీన్ నూలి
నిర్మాత: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
ద‌ర్శ‌కుడు: సాగ‌ర్ కె. చంద్ర‌
బ్యాన‌ర్: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల తేదీ: 25 ఫిబ్ర‌వ‌రి 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించిన 'భీమ్లా నాయక్' మూవీ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. దానికి తోడు పవర్ స్టార్ ని ఢీ కొట్టే రోల్ లో రానా దగ్గుబాటి నటించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగిన యుద్ధం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్.. వెండితెరపై పవర్ తుఫాన్ చూపించిందో లేదో తెలుసుకుందాం.

కథ:
తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుని కొడుకైన డేనియల్ శేఖర్(రానా) మద్యం సేవించి కారులో పెద్ద సంఖ్యలో లిక్కర్ బాటిల్స్ తీసుకుళ్తుండగా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఆంధ్రా పోలీసులు అడ్డుకుంటారు. మద్యం మత్తులో ఉన్న డేనియల్.. పోలీసులని కొట్టడంతో ఎస్సై భీమ్లా నాయక్(పవన్) వచ్చి.. డేనియల్ ని కొట్టి స్టేషన్ కి తీసుకెళతాడు. స్టేషన్ కి వెళ్ళాక డేనియల్ ఫోన్ చెక్ చేయగా, అతను పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి అని అర్థమయ్యి.. సీఐ కోదండ‌రామ్(మురళి శర్మ) సూచనతో డేనియల్ కి స్టేషన్ లో మర్యాదలు చేస్తారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కొట్టడం, పంచె ఊడదీసి అరెస్ట్ చేయడం, ఎఫ్ఐఆర్ రాసి బాటిల్స్ సీజ్ చేయడం వంటి చర్యలతో హర్ట్ అయిన డేనియల్.. చిన్న నాటకం ఆడి, సీజ్ చేసిన బాటిల్ ఓపెన్ చేసి నాయక్ చేత మందు సర్వ్ చేపించుకుంటాడు. దానిని సీక్రెట్ గా మొబైల్ లో షూట్ చేసి.. రెండు వారాలు జైల్లో ఉండి బయటికొచ్చాక, ఆ వీడియో అడ్డుపెట్టుకొని నాయక్ ని సస్పెండ్ చేయిస్తాడు. అక్కడి నుంచి వీళ్ళ గొడవ యుద్ధంలా మారిపోతుంది. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు పైచేయి సాధించారో తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.

ఎనాలిసిస్:
దబాంగ్ సినిమాకి రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ లో ఫ్యాన్స్ కోసం ఎలాగైతే మార్పులు చేశారో.. మ‌ల‌యాళం మూవీ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌'కు రీమేక్ గా వచ్చిన భీమ్లా నాయక్ లోనూ భారీగా మార్పులు చేశారు. ఈ మార్పులు చేసి ఫ్యాన్స్ ని అలరించడంలో డైరెక్టర్ సాగర్, రైటర్ త్రివిక్రమ్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ, పవన్ పోషించిన పాత్ర పేరు 'భీమ్లా నాయక్'నే టైటిల్ గా పెట్టడంతో పాటు.. సాంగ్స్, టీజర్స్ లో పవన్ ని హైలైట్ చేయడంతో.. సినిమాలో రానా పాత్ర తగ్గిస్తారన్న అభిప్రాయం కలిగింది. కానీ సినిమా చూశాక ఆ అభిప్రాయం పూర్తిగా తొలిగిపోయింది. రానా పాత్రని నాయక్ పాత్రకి ధీటుగా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు.

ఫస్టాఫ్ లో ఓ వైపు డేనియల్ రెచ్చిపోతుంటే.. మరోవైపు నాయక్ మాత్రం సైలెంట్ గా ఆచితూచి అడుగులు వేయడం ఫ్యాన్స్ ని మొదట కాస్త నిరుత్సాహానికి గురిచేస్తుంది. కానీ ఎప్పుడైతే సస్పెండ్ అయ్యి ఒంటి మీద యూనిఫామ్ తీసేస్తాడో.. అప్పుడు నాయక్ జూలు విదిల్చిన సింహంలా రెచ్చిపోతాడు. అప్పటి నుంచి వీరి గొడవ చిన్నపాటి యుద్ధాన్ని తలపించేలా ఉంటుంది. నాయక్, డేనియల్ ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ గొడవ పడుతుంటారు. చివరికి ఇద్దరూ ఒకరినొకరు ఇద్దరూ చంపుకునే అంతగా కొట్టుకుంటారు. అప్పుడొస్తుంది క్లైమాక్స్ ట్విస్ట్. ఈ మూవీలో నాయక్ కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. ఇది ఒరిజినల్ మూవీలో ఉండదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూడటానికి చాలా రెగ్యులర్ గా ఉంది. కానీ దానిని క్లైమాక్స్ కి లింక్ చేసిన విధానం బాగుంది.

ఈ సినిమా పూర్తిగా ఫ్యాన్స్ కి దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. కానీ స్క్రిప్ట్ మీద మరింత శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. చాలా సీన్స్ సాధారణంగా ఉన్నాయి. తమన్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. కానీ సినిమాలో సాంగ్స్ పిక్చరైజేషన్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ర‌వి కె. చంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్:
పవన్, రానా
డైలాగ్స్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు
కథనంలో వేగం లేకపోవడం

న‌టీన‌టుల ప‌నితీరు:
పవన్ కళ్యాణ్ తన స్టైల్, ఆటిట్యూడ్, యాక్షన్ తో ఎప్పటిలాగే అదరగొట్టేశాడు. ఇక రానా స్క్రీన్ ప్రజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ లాంటి స్టార్ కి ధీటుగా నటించి మెప్పించాడు. నాయక్ భార్య సుగుణ క్యారెక్టర్ లో నిత్యామీనన్ ఒదిగిపోయింది. పాత్రకి తగ్గట్లు గడుసుతనాన్ని చక్కగా చూపించింది. రానా భార్యగా సంయుక్త మీనన్ తక్కువ సన్నివేశాలకే పరిమితమైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. ముర‌ళీశ‌ర్మ‌, స‌ముద్ర‌క‌ని తదితరులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌:
పక్కా ఫ్యాన్స్ మూవీ. ఫ్యాన్స్ ని అలరించడంలో భీమ్లా నాయక్ విజయం సాధించాడు.

-గంగసాని






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.