![]() |
![]() |

అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఇండియాలో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ ఓటిటి సంస్థ. తాజాగా ఈ దిగ్గజ సంస్థ నుంచి మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ రాబోతుంది. అదే ‘మోడ్రన్ లవ్’. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్‌లో రెండు సీజన్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇండియాలో కూడా దీన్ని విడుదల చేస్తున్నారు. ప్రముఖ భాషలన్నింటిలోనూ ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు ఈ విషయాన్ని ప్రకటించారు.
తెలుగులో 'మోడ్రన్ లవ్ హైదరాబాద్'లో రానున్న ఈ సిరీస్, తమిళంలో 'మోడ్రన్ లవ్ చెన్నై'గా, హిందీలో 'మోడ్రన్ లవ్ ముంబై'గా రానున్నది. 2022లోనే ఈ అడాప్టేషన్స్‌ను ప్రసారం చేయనున్నారు. కచ్చితంగా 'మోడ్రన్ లవ్' ఇండియాలో కూడా ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. "మోడ్రన్ లవ్ అనేది భిన్నమైన రూపాలలో ఉన్న ప్రేమకు ఒక భావగీతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ షోలో ఉన్న పాత్రలతో రియల్ లైఫ్‌లో తమను తాము చూసుకున్నామని తెలిపారు. అలాగే భారతదేశపు భిన్నమైన సంస్కృతికి కూడా ఈ సిరీస్ అతికినట్లు సరిపోతుంది. కచ్చితంగా ఇక్కడ కూడా వీక్షకుల ప్రేమాభిమానాలు తమకు లభిస్తాయని ఆశిస్తున్నాం" అని షో నిర్వాహకులు తెలిపారు.
![]() |
![]() |