![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో మంచు ఫ్యామిలీకి ప్రాతినిధ్యం లభించకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారంతో పాటు, ఇతర సమస్యలను చర్చించడానికి చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణమూర్తి తదితరులు విజయవాడలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వారి మధ్య భేటీలో సమస్యలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అదే విషయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు చిరంజీవి, మహేశ్. కాగా చిత్ర ప్రముఖుల్లో మోహన్‌బాబు కానీ, విష్ణు కానీ కనిపించకపోవడం చర్చకు తావిచ్చింది. ప్రస్తుతం మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుని హోదాను అనుభవిస్తున్నాడు. అయినా కానీ అతనికి జగన్ భేటీకి ఆహ్వానం అందలేదు. కమెడియన్ అలీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి సైతం జగన్‌తో మీటింగ్‌లో కనిపించారు కానీ మంచు ఫ్యామిలీ నుంచి ఒక్కరూ కనిపించ లేదేమిటని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.
గతంలో సందర్భం వచ్చిన ప్రతిసారీ సినిమా ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సన్మానించుకోవాలని మోహన్‌బాబు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్‌ను ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదనే భావన ఆయన మాటల్లో కనిపిస్తూ వచ్చింది. అయినప్పటికీ జగన్‌ను సన్మానించే విషయంలో ఇండస్ట్రీ ముందుకు రాలేదు. ఇప్పుడు సినిమా టికెట్ ధరల వ్యవహారంతో పాటు, పలు థియేటర్లను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ సీజ్ చేయడంతో ఇండస్ట్రీ దిగిరాక తప్పలేదు. అలా చిరంజీవి సహా ఇతర ప్రముఖుల్ని తన దగ్గరకు రప్పించుకొనేలా చేయడంలో జగన్ సక్సెసయ్యారు.
కీలకమైన నేటి భేటికి తొలిసారిగా సూపర్‌స్టార్లు మహేశ్, ప్రభాస్ కూడా వెళ్లారు. వాళ్లకు దక్కిన ఆహ్వానం ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన మోహన్‌బాబుకు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. జగన్‌ను స్వయానా బంధువు కూడా అయిన మోహన్‌బాబును ఎవరూ పిలవలేదా? అని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మంచు ఫ్యామిలీకి సీఎం జగన్‌తో కీలక భేటీలో ప్రాతినిధ్యం లభించకపోవడం విశేషంగానే చెప్పుకోవాలి.
![]() |
![]() |