![]() |
![]() |

టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం భేటీ అయిన సంగతి తెలిసిందే. టికెట్ ధరలతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించిన ఈ భేటీలో చిరంజీవి, నారాయణమూర్తి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ సినీ పరిశ్రమ వైజాగ్ కి షిఫ్ట్ అవ్వాలని కోరారు.
ఏపీలో జగన్ సర్కార్ సినిమా టికెట్ ధరలను తగ్గించడం వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పలువురు సినీ ప్రముఖులు తప్పుబట్టారు. మరోవైపు అధికార పార్టీ నేతలు కొందరు సినీ పరిశ్రమ తెలంగాణలో ఉంది, దానివల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదన్నట్లుగా మాట్లాడారు. అయితే తాజాగా భేటీలో సీఎం జగన్ కూడా సినీ పరిశ్రమ వైజాగ్ కి షిఫ్ట్ అవ్వాలని కోరడం ఆసక్తికరంగా మారింది.
"ప్రేక్షకులకు భారంకాకుండా, పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరిగేలా గత కొద్ది కాలంగా కసరత్తు చేసి మంచి ధరలు తీసుకురావడం జరిగింది. రెమ్యునరేషన్లు కాకుండా కేవలం సినిమా కోసమే 100 కోట్ల కి పైగా ఖర్చు అయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా వెసులుబాటు ఇస్తాం. అలాగే ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ జరిపేలా చూడాలి. నెమ్మదిగా సినీపరిశ్రమ కూడా విశాఖపట్నం రావాలి. తెలంగాణాతో పోలిస్తే సినీపరిశ్రమకి ఏపీ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది. ఏపీలో ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు ఎక్కువ, ఆదాయం ఎక్కువ. అందరికీ విశాఖపట్నంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం. అలాగే స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపించే వాళ్లకు కూడా వైజాగ్ లో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్ లతో విశాఖ పోటీపడగలదు. ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ వెళ్లేందుకు అడుగులు పడాలి." అని జగన్ అన్నారు.
![]() |
![]() |