![]() |
![]() |

యాంగ్రీ మేన్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శేఖర్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'జోసెఫ్'కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 25న విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరి పేర్లు మారిపోయి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 4న 'శేఖర్' మూవీ ప్రకటన వచ్చింది. ఆ సమయంలో రాజశేఖర్ లుక్ ని రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో డైరెక్టర్ గా లలిత్, ప్రొడ్యూసర్ గా ఎంఎల్వీ సత్యనారాయణ పేర్లు ఉన్నాయి. ఇన్నాళ్లకు మళ్ళీ ఈ మూవీకి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ను వదిలారు. అందులో డైరెక్టర్ గా రాజశేఖర్ సతీమణి జీవితా రాజశేఖర్, ప్రొడ్యూసర్ గా బీరం సుధాకర్ రెడ్డి పేర్లు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ లు మారడం కారణాలేంటో తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే దర్శకురాలిగా జీవితా రాజశేఖర్ గతంలో నాలుగు సినిమాలు చేశారు. ఈ నాలుగూ రీమేక్ సినిమాలు కావడం, అన్నింట్లోనూ రాజశేఖర్ హీరోగా నటించడం విశేషం. రాజశేఖర్- జీవితా కాంబినేషన్ లో వస్తున్న ఐదో సినిమా 'శేఖర్' ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
![]() |
![]() |