![]() |
![]() |

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు గురై కేవలం 46 ఏళ్ల వయసులో అక్టోబర్ 29న ఆకస్మికంగా మృతి చెందడంతో యావత్ దేశ చిత్రసీమ షాక్‌కు గురైంది. ఆయన అభిమానులకైతే గుండెలు పగిలాయి. కొంతమంది తమ ఆరాధ్యనటుడి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. పునీత్ మరణం ఆయన కుటుంబానికైతే తీరని వేదనను మిగిల్చింది. ఆయన భార్య అశ్విని రేవంత్ పరిస్థితి మరీ బాధాకరం. పునీత్ ఆమె లోకం, సర్వస్వం. భర్త మృతి తర్వాత తొలిసారి నవంబర్ 16న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆయన అభిమానులను ఉద్దేశించి, ఎమోషనల్‌గా ఒక లెటర్‌ను ఆమె పంచుకున్నారు. ఇది సోషల్ మీడియాలో ఆమె ఫస్ట్ పోస్ట్ కూడా. అది చదివిన ఫ్యాన్స్‌కు దుఃఖం ఆగలేదు.
హృదయాన్ని కదిలించే ఆ లెటర్‌లో, "శ్రీ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మృతి కేవలం కుటుంబాన్నే కాకుండా కర్ణాటక రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి లోనుచేసింది. ఆయనను పవర్‌స్టార్‌గా మార్చిన మీకు (ఫ్యాన్స్‌కు) ఆయన మరణం ఎంతటి బాధను కలిగించివుంటుందో అర్థం చేసుకోగలను. అంతటి బాధను అనుభవిస్తూ కూడా మీరు ప్రశాంతంగానే ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేందుకు దోహదపడ్డారు. మీ ప్రియమైన అప్పు (పునీత్) బాటలో నడుస్తూ వేలాదిమంది తన కళ్లను దానం చేయడం చూసినప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఇలాంటి మంచి పనుల ద్వారా ఆయనను ఆదర్శవంతునిగా మీరు నిల్పుతున్నారు. ఆయన స్మృతి మీలో స్ఫూర్తిని కలిగిస్తుండటం ముదావహం. మా మొత్తం కుటుంబం తరపున అందరు అభిమానులకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మీరు చూపిస్తున్న ప్రేమకు, మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా." అని ఆమె రాసుకొచ్చారు.

కాగా నటునిగా సినీ పరిశ్రమకు, సేవామూర్తిగా ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఆయనకు 'కర్ణాటక రత్న' పురస్కారాన్ని ప్రకటించింది.
![]() |
![]() |