![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న హైవోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ 'అఖండ'. సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ "అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా" అనే పాట ఓ మాదిరిగా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందింది. ఇప్పుడు టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో మూడో రోజు కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. "భమ్ అఖండ భమ్ భమ్ అఖండ" అంటూ సాగే ఈ పాటకు తమన్ అందించిన ట్యూన్స్ గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. చిన్నపాటి ప్రోమోలోనే రొమాలు నిక్కబొడిచేలా పాట ఉందంటే, ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది. ఈ సాంగ్ ప్రోమోకు ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 8వ తేదీ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు.
బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి 'అఖండ'ను నిర్మిస్తున్నారు.
కాగా సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే విషయం ఇంకా తేలలేదు. ఇదివరకు దీపావళికి అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ అనుకున్నారు. దీపావళి వెళ్లిపోయింది. లేటెస్ట్‌గా ఇండస్ట్రీలో నడుస్తున్న ప్రచారం ప్రకారం క్రిస్మస్ సీజన్‌లో ఈ సినిమా విడుదల కావచ్చు. డిసెంబర్ 24న అఖండ రిలీజ్ కావచ్చని సమాచారం.
'సింహా', 'లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న బాలయ్య-బోయపాటి కాంబినేషన్ ఇప్పుడు 'అఖండ'తో ఆ ఫీట్‌ను పునరావృతం చేస్తుందనే నమ్మకం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్లే ఈ సినిమా బిజినెస్ జరిగింది. తెలంగాణ ఏరియా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
![]() |
![]() |