![]() |
![]() |

సూపర్‌స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్ చేసిన 'అణ్ణాత్త' సినిమా తెలుగులో 'పెద్దన్న' పేరుతో దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత కథను పాత సీసాలో ముంచి తీసినట్లుగా ఉందని విమర్శకులు తేల్చేసిన ఈ సినిమా కలెక్షన్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. రజనీ సినిమా అంటే తెలుగు ఆడియెన్స్‌లోనూ చాలా క్రేజ్. అలాంటిది 'పెద్దన్న'కు తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత తక్కువగా కేవలం రూ. 12.5 కోట్లు మాత్రమే తెలుగు బయ్యర్లు ఈ సినిమాపై వెచ్చించారు.
నిజానికి చాలా సునాయాసంగా ఈ ఎమౌంట్ రికవర్ అవ్వాలి. కానీ ఫస్ట్ డే రూ. 2 కోట్ల షేర్ మార్కును కూడా పెద్దన్న అందుకోలేకపోవడం ట్రేడ్ పండిట్స్‌ను కూడా విస్మయానికి గురిచేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన షేర్ కేవలం రూ. 1.60 కోట్లే! తెలంగాణలో రూ. 53 లక్షలు, ఆంధ్రాలో రూ. 83 లక్షలు, రాయలసీమలో రూ. 24 లక్షల షేర్ సాధించింది 'పెద్దన్న'. అంటే ఫస్ట్ డే 12.8 శాతం మాత్రమే రికవర్ అయ్యిందన్న మాట. ఇది చాలా తక్కువ కింద లెక్క. ఇదే స్థితి కొనసాగితే బయ్యర్లు బాగా నష్టపోయే ప్రమాదం ఉంది.
అయితే శివ డైరెక్ట్ చేసిన సినిమాల్లోనే అత్యంత వీక్ ఫిల్మ్‌గా విమర్శకులు పేర్కొన్న 'పెద్దన్న' ఒరిజినల్ ఫిల్మ్ 'అణ్ణాత్త' మాత్రం తమిళనాట తొలిరోజు బెటర్‌గా వసూళ్లు సాధించడం గమనార్హం.
![]() |
![]() |