![]() |
![]() |

సెప్టెంబర్ 10న రాయదుర్గం దగ్గర బైక్ స్కిడ్ అయిపోయి, యాక్సిడెంట్‌కు గురయ్యాడు హీరో సాయిధరమ్ తేజ్. ఘటన జరిగిన వెంటనే స్పృహ కోల్పోయిన అతడిని మొదట దగ్గర్లోని మెడికవర్ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స జరిపి, అనంతరం జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స అందించారు. ముఖం, ఛాతీపైన బలమైన గాయాలవడంతో పాటు కాలర్ బోన్ విరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. అతని ఆరోగ్య స్థితి గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కాలర్ బోన్ సర్జరీ తర్వాత కొన్ని వారాల పాటు హాస్పిటల్‌లోనే గడిపాక ఇటీవల డిశ్చార్జయి ఇంటికి వచ్చాడు సాయితేజ్. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పట్నుంచీ ఇంతదాకా అతడి ముఖం చూపించకపోవడంతో, అతడి ముఖానికి ఏమైందంటూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ వచ్చారు.
ఇదిగో.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు సాయితేజ్ ఎలా ఉన్నాడో ఫస్ట్ టైమ్ ప్రపంచానికి చూపించాడు. దీపావళి పండుగను మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి చిరంజీవి ఇంట్లో సంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా హీరోలందరూ కలిసి ఒక ఫొటో దిగారు. మేనల్లుడు సాయితేజ్‌ను పక్కన పెట్టుకొని మరీ చిరంజీవి ఓ ఫొటో దిగారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన చిరు, "అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ." అని రాసుకొచ్చారు.

ఆ ఫొటోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు వారి వారసులు రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, అకిర నందన్‌తో పాటు అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. అందరి ముఖాల్లోనూ అమితానందం తొంగిచూస్తోంది. మునుపటితో పోలిస్తే సాయితేజ్ సన్నబడినట్లు కనిపించాడు. మరికొంత విశ్రాంతి తీసుకొని, త్వరలోనే తన తదుపరి సినిమాను అతను మొదలు పెట్టే అవకాశం ఉంది.
![]() |
![]() |