![]() |
![]() |

``డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు`` అనే ట్యాగ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆకాశ్ పూరి. తొలుత బాలనటుడిగా, ఆపై టీనేజ్ హీరోగా, రీసెంట్ గా కమర్షియల్ హీరోగా.. ఇలా ఆర్టిస్ట్ గా తన ఏజ్ కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు రకరకాల అవతారాలు ఎత్తుతున్నాడు ఆకాశ్. ప్రతీసారి మంచి మార్కులు సంపాదిస్తున్నాడు. కుర్రాడిలో మాంచి ఈజ్ ఉందిరా అనిపించుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తొలి చిత్రం `చిరుత` (2007) నుంచే ఆకాశ్ పూరి.. ఆర్టిస్ట్ మెటీరియల్ అనిపించుకుంటున్నాడు. `బుజ్జిగాడు` (2008), `ఏక్ నిరంజన్` (2009), `ధోని` (2012), `గబ్బర్ సింగ్` (2012).. ఇలా `చిరుత` తరువాత బాలనటుడిగా చేసిన ప్రతీ సినిమాలోనూ తనదైన అభినయంతో మురిపించాడు. అయితే, ఇక్కడి వరకు ఆకాశ్ పై ఎలాంటి భారం లేదు. ఎందుకంటే.. అతనో చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రమే కాబట్టి.
ఎప్పుడైతే కథానాయకుడి పాత్రలకు షిప్ట్ అయ్యాడో.. అక్కడ నుండే ఆకాశ్ పై అసలైన భారం పడింది. `ఆంధ్రా పోరి`(2015)లో టీనేజ్ హీరోగా చేసినా.. తన తండ్రి పూరి డైరెక్ట్ చేసిన `మెహబూబా`(2018)తో కమర్షియల్ హీరోగా మొదటి అడుగు వేసినా.. రీసెంట్ గా`రొమాంటిక్`తో పక్కా పూరీ మార్క్ హీరోగా పలకరించినా.. థియేటర్స్ కి ఆడియన్స్ ని రాబట్టాల్సిన పని తన భుజస్కందాలపై పడింది. ఈ మూడు సినిమాల్లోనూ తన పరంగా మెప్పించినా.. ఆకర్షణీయమైన కథ, కథనాలు లేకపోవడంతో ఫలితాలు తేడా కొట్టాయి. మరీముఖ్యంగా.. `రొమాంటిక్`లో వయసుకు మించిన `యాక్షన్` చేయాల్సిరావడంతో సినిమా జనానికి అంతగా కనెక్ట్ అవడం లేదంటున్నారు విశ్లేషకులు. కాన్ఫిడెంట్ గా తన రోల్ చేసుకుపోయినా.. ఇలాంటి పాత్రలు చేసే వయసు తనది కాకపోవడంతో.. `రొమాంటిక్` మూవీ అతనికి ప్లస్ కంటే మైనస్ అయిందనే అంటున్నారు. ఎరోటిక్ సీన్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసి కొంతమేర వసూళ్ళు రాబట్టుకున్నా.. ఆకాశ్ కి సరైన స్క్రిప్ట్ ఇంకా పడలేదనే మాటలే వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా.. ఆకాశ్ కి హీరోగా సాలిడ్ హిట్ కావాలంటే మరికొంతకాలం వేచిచూడక తప్పడం లేదన్నదే విశ్లేషకుల అభిప్రాయం.
![]() |
![]() |