![]() |
![]() |

ఒక దశలో కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమకథా చిత్రాలకు చిరునామాగా నిలిచారు విక్టరీ వెంకటేశ్. `ప్రేమించుకుందాం.. రా!` వంటి ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీ తరువాత దర్శకుడు జయంత్ సి. పరాన్జీ కాంబినేషన్ లో వెంకీ నటించిన `ప్రేమంటే ఇదేరా!` కూడా ఇదే కోవకు చెందిన సినిమానే. బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా తెలుగులో నటించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు.. సంగీత దర్శకుడు రమణ గోగులకి కూడా స్వరకర్తగా ఇదే తొలి చిత్రం.
స్నేహితుల పెళ్ళిలో గొడవలతో మొదలైన మురళి (వెంకటేశ్), శైలజ (ప్రీతి జింటా) పరిచయం ప్రేమకు ఎలా దారి తీసింది? `ప్రేమంటే ఇదేరా!` అనిపించేలా.. పెద్దల అనుమతితో ఎలా ఒక్కటయ్యారు? అనేదే ఈ చిత్ర కథాంశం. వెంకీ - ప్రీతి కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన బలంగా నిలవగా.. జయంత్ దర్శకత్వ ప్రతిభ, రమణ గోగుల పాటలు, రాజ్ నేపథ్య సంగీతం, జయనన్ విన్సెంట్ ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీహరి, లక్ష్మీ, రంగనాథ్, అలీ, రమాప్రభ, సత్యనారాయణ, బ్రహ్మానందం, చంద్రమోహన్, శివాజీ రాజా, శివాజీ, సన, రజిత అలరించారు.
``నాలో ఉన్న ప్రేమ``, ``ఏమో ఎక్కడుందో``, ``వయసా చూసుకో``, `మనసే ఎదురు``, ``నైజాం బాబులు``, ``బొంబాయి బొమ్మ``, ``ఓ మేరి``.. ఇలా ఇందులోని గీతాలన్ని ప్రజాదరణ పొందాయి. `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` (జయనన్ విన్సెంట్) విభాగంలో `నంది` పురస్కారం అందుకున్న `ప్రేమంటే ఇదేరా!`.. కన్నడలో `ఓ ప్రేమవే` (వి. రవిచంద్రన్, రంభ, శ్రీహరి) పేరుతో రీమేకై ఆదరణ పొందింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె. అశోక్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1998 అక్టోబర్ 30న విడుదలై మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `ప్రేమంటే ఇదేరా!`.. నేటితో 23 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |