![]() |
![]() |

ప్రఖ్యాత మలయాళం నటుడు నెడుముడి వేణు సోమవారం (అక్టోబర్ 11) మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆదివారం అసౌకర్యంగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆగమేఘాల మీద తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందజేశారు. ఇదివరకు ఆయన కొవిడ్ 19 బారినపడి, దాని నుంచి కోలుకున్నారు. ఇటు కమర్షియల్, అటు ప్యారలల్ సినిమాల రెండింటిలోనూ అనేక పాత్రల్లో అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ వచ్చిన ఆయన సినీ ప్రియుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేశారు.
నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినా, 'భారతీయుడు' చిత్రంలో చేసిన సిబిఐ ఆఫీసర్ కృష్ణస్వామి పాత్ర ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచితులే. అలాగే 'అపరిచితుడు'లో విక్రమ్ తండ్రిగా నటించి ఆకట్టుకున్నారు వేణు.
ఆయన పూర్తి పేరు కేశవన్ వేణుగోపాల్. నెడుముడి అనేది ఆయన పుట్టి పెరిగిన ఊరు. రంగస్థలంపై నెడుముడి వేణుగా వచ్చిన పేరుతోటే ఆయన పాపులర్ అయ్యారు. తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 500 పైగా చిత్రాల్లో నటించారు వేణు. ఎక్కువగా మాతృభాష మలయాళంలోనే నటించిన ఆయన, కొన్ని తమిళ చిత్రాల్లోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. నటునిగా మూడుసార్లు జాతీయ అవార్డులు, ఆరు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు పొందారు.
![]() |
![]() |