![]() |
![]() |

సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావుపై నటుడు నాగబాబు అనకూడని మాటలు అన్నారు. ఆయన ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఊడిపోతాడో తెలీదంటూ అనుచితంగా వ్యాఖ్యానించారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ దారుణ వ్యాఖ్యలు చేశారు. "ప్రకాశ్‌రాజ్ ఐదుసార్లు నేషనల్ అవార్డ్ తీసుకున్నాడు. ఈ కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్.. వీళ్లందరి కన్నా కూడా సుపీరియర్ యాక్టర్ కదా. వీళ్లెందుకింత జెలసీతో కుంగిపోతున్నారు. కోట శ్రీనివాసరావుకి ఏంటండీ.. ఆ వయసులో ఏంటీ.. ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఊడిపోతాడో తెలీదు. అనకూడదు కానీ ఆ మాట.. అతను వయసుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదు. ఎన్నిసార్లు వినీ వినీ చిరాకు వస్తుందంటే అతని మీద." అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు నాగబాబు.
"అఫ్‌కోర్స్ బాబూ మోహన్ ఈ మధ్యన మాట్లాడుతున్నారు. ఏంటండీ.. మన భాషకాకపోతే, మనవాడు కాకపోతే తరిమేస్తారా? అతను (ప్రకాశ్‌రాజ్) భారతీయుడు కాదా? అతని ఓట్లు కావాలి, అతను వస్తే పనులు చేయించుకోవాలి, అతనితోటి మన సినిమాల్లో యాక్ట్ చేయించుకోవాలి, క్యారెక్టర్ యాక్టర్‌గా అతన్ని మనం ఉపయోగించుకోవాలి, కానీ అతను మాత్రం మనకు పనికిరాడా?" అంటూ మాట్లాడారు.
నటుడిగా అమిత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కోట శ్రీనివాసరావుపై నాగబాబు చేసిన దారుణ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవించి ఉన్న ఒక వయో వృద్ధుని గురించి, నటుడిగా గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్న వ్యక్తి గురించి 'ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఊడిపోతాడు తెలీదు' అని మాట్లాడటం సంస్కారహీనమంటూ సోషల్ మీడియాలో నాగబాబును ట్రోల్ చేస్తున్నారు. అసలు ప్రకాశ్‌రాజ్‌కు నాగబాబు ఎందుకింత వెన్నుదన్నుగా నిలబడుతున్నాడో అర్థం కావట్లేదని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
కొద్ది రోజులుగా తెలుగు నటులందరినీ ప్రకాశ్‌రాజ్ కంటే తక్కువ ప్రతిభ కలిగినవారుగా చిత్రిస్తూ వస్తున్న నాగబాబు ఇప్పుడు హద్దులు దాటి, కోట శ్రీనివాసరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇండస్ట్రీలోని నటులతో పాటు మిగతా అన్ని శాఖల వారూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగువారిపై కంటే ఎక్కడ్నుంచో వచ్చిన వ్యక్తిపై ఇంత ప్రేమ ఎందుకు ప్రదర్శిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
![]() |
![]() |