![]() |
![]() |

తెలుగువారిని విశేషంగా అలరించిన వెండితెర జంటల్లో విక్టరీ వెంకటేశ్ - అభినేత్రి సౌందర్య జోడీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో `పవిత్ర బంధం` (1996) వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన అగ్ర దర్శకుడు ముత్యాల సుబ్బయ్య.. దాదాపు అదే టీమ్ (గీతా చిత్ర ఇంటర్నేషనల్ నిర్మాణం, భూపతి రాజా కథ, పోసాని కృష్ణ మురళి సంభాషణలు, కె. రవీంద్రబాబు ఛాయాగ్రహణం, గౌతం రాజు కూర్పు)తో రూపొందించిన మరో సినిమా `పెళ్ళి చేసుకుందాం`.
ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన శాంతి (సౌందర్య).. సదరు హంతకుడి తమ్ముడి చేతిలో అనూహ్యంగా అత్యాచారానికి గురవుతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోవాళ్ళ ఆదరణకు నోచుకోకపోవడమే కాకుండా.. సమాజంలో పలు అవమానాలకు గురైన శాంతికి మల్టి మిలియనీర్ ఆనంద్ (వెంకటేశ్) ఆశ్రయమిచ్చి చేయూతనిస్తాడు. పలు పరిణామాల అనంతరం.. ఒకరిపై మరొకరికి ఎనలేని అభిమానం ఉన్న ఈ జంట చివరాఖరికి పెళ్ళితో ఎలా ఒక్కటయ్యారు అన్నదే ఈ చిత్ర కథాంశం.
లైలా మరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దేవన్, సత్య ప్రకాశ్, బ్రహ్మానందం, సుధాకర్, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణ, సుమిత్ర, రజిత, రాగిణి, అశ్వని, మాస్టర్ మహేంద్ర, బేబి సౌమ్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ``కోకిల కోకిల కూ అన్నది``, ``ఘుమఘుమలాడే``, ``ఓ లైలా లైలా``, ``మనసున మనసై``, ``ఎన్నో ఎన్నో``, ``నువ్వేమి చేశావు నేరం``.. ఇలా కోటి సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలన్ని ప్రజాదరణ పొందాయి. 1997 అక్టోబర్ 9న విడుదలై అఖండ విజయం సాధించిన `పెళ్ళి చేసుకుందాం`.. తమిళ్, బెంగాలి, హిందీ, కన్నడ, బంగ్లాదేశి బెంగాలి భాషల్లో రీమేక్ అయింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 24 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
![]() |
![]() |