![]() |
![]() |

అక్టోబర్ 10న జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తను సపోర్ట్ చేస్తున్న మంచు విష్ణు ప్యానల్ గన్‌షాట్‌గా గెలుస్తుందని జోస్యం చెప్పారు ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేశ్. నటుడు బెనర్జీ ఒక ముఠానాయకుడిగా వ్యవహరిస్తూ, తాను వెనుక ఉండి, మిగతావాళ్లను ముందుకు ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ప్రకాశ్‌రాజ్‌ను చిరంజీవి 'మా' నుంచి రెండు సార్లు సస్పెండ్ చేశారనీ, అప్పుడు ప్రకాశ్‌రాజ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాగబాబు, ఇప్పుడెందుకు ఆయనను ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు.
తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై నరేశ్ మాట్లాడారు. "రేపటి ఎన్నికల్లో గన్‌షాట్‌గా మేం గెలుస్తున్నాం. ఫుల్ ప్యానల్ గెలుస్తున్నాం. మా ప్రయత్నం అదే. పోయినసారి డివిజన్ అవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయ్. 'మా' అనేది ఒక చిన్న గోల్డ్ ఫిష్ ట్యాంక్. ఇది సముద్రం కాదు. రేపు మేం ఒకరొకరం ముఖాలు చూసుకోవాలి. అయితే జనానికి అర్థమైపోయింది, ఈ మొత్తం సమస్య వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి ఎవరనేది. ఒక ముఠానాయకుడు ఇదంతా చేస్తున్నాడు." అని ఆయన అన్నారు.
"మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సర్వీస్ చేద్దామని నాతో పాటు మరికొంతమంది వస్తే, 'మా' ద్వారా వచ్చే బెనిఫిట్స్ అందుకుందామని ఇంకో ముఠా తయారయ్యింది. ఆ ముఠాకు బెనర్జీ నాయకుడు. అతను నడుపుతూ వచ్చాడు. అతనితో మరికొంత మంది చేరారు. వీళ్లు ఒక నెగటివ్ ప్రచారాన్ని నడుపుతున్నారు. అతను బయటకు రాకుండా వెనుక ఉండి, మిగతావాళ్లను ముందుకు ఉసిగొల్పుతున్నాడు." అని ఆరోపించారు నరేశ్.

"నాగబాబు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. తెలుగు నటి అయిన జయసుధను ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా నిలబెట్టమని అడిగాను. అప్పుడు ఈ ఎన్నికల గొడవ వచ్చి ఉండేది కాదు. దానికి నాగబాబును ఆన్సర్ చెప్పమనండి. అందుకు బదులుగా ప్రకాశ్‌రాజ్‌ను తీసుకొచ్చి నిలబెట్టారు. ప్రకాశ్‌రాజ్‌ను రెండుసార్లు సస్పెండ్ చేసింది చిరంజీవి గారే. ఇదే నాగబాబు మీడియాలో ప్రకాశ్‌రాజ్‌ను తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారు. అలాంటి నాగబాబే ఆయన్ని ఎంకరేజ్ చేస్తుంటే.. ఎవరికి ద్వంద్వ వైఖరి ఉన్నట్లు?" అని ఆయన ప్రశ్నించారు.
"ప్రకాశ్‌రాజ్‌కు 'మా' గురించి ఏమీ తెలీదు. ఒక్క జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు కాలేదు. ఒక్కసారీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. అలాంటివాడు ప్రెసిడెంట్ పోస్టులోకి వచ్చి కూర్చుంటే రేపు పరిస్థితేంటి?" అని అడిగారు నరేశ్.
![]() |
![]() |