![]() |
![]() |

ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ ఫిలిం అవార్డుల వేడుక శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో అట్టహాసంగా జరిగింది. సినీ తారలు కదలి వచ్చిన ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమా రంగం మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా పురస్కారాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయని, బాధ్యతను మరింత పెంపొందిస్తాయని, అన్ని విధాలుగా రాణించేందుకు దోహదపడతాయని అన్నారు.
సమాజంలో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన వినోద మాధ్యమం సినిమా అని, బాధ్యతాయుత సినిమాలు నిర్మించాలని గవర్నర్ తమిళి సై కోరారు. దక్షిణాదిలో టాలీవుడ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షల మంది సినిమా రంగంలో ఉపాధి పొందుతున్నారని అభినందించారు. సమాజంలో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు సినిమా రంగం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, హీరో నాని, సునీల్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 2019, 2020 సంవత్సరాలకు సంబంధించి పురస్కారాలు ప్రదానం చేశారు. ఫైవ్ డికేడ్స్ సినీ గోయర్స్ పురస్కారాలను జయప్రద, ప్రకాష్ రాజ్ స్వీకరించారు. సినీ గోయర్స్ జీవన సాఫల్య పురస్కారాన్ని రాజేంద్రప్రసాద్ అందుకున్నారు.
2019 పురస్కార గ్రహీతలు
ఉత్తమ హీరో హీరోయిన్లు గా చిరంజీవి (సై రా నరసింహారెడ్డి), తమన్నా (ఎఫ్ 2) అవార్డులు స్వీకరించారు. ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి (మహర్షి), ఉత్తమ సంచలన హీరో హీరోయిన్లు గా నాని (జెర్సీ), మెహ్రీన్ (ఎఫ్ 2), ఉత్తమ సంచలన దర్శకుడిగా సురేందర్ రెడ్డి (సై రా నరసింహా రెడ్డి), ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్లుగా రావు రమేష్ (ప్రతి రోజు పండుగే), డాక్టర్ రాజేంద్రప్రసాద్ (ఓహ్ బేబీ), ఆశ్రీత (యాత్ర), ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి), ఉత్తమ విలన్ గా కబీర్ దుహన్ సింగ్ (యాక్షన్), ఉత్తమ గాయని గాయకులుగా మంగ్లీ (జార్జి రెడ్డి), రాహుల్ సిప్లిగంజ్ (మహర్షి), ఉత్తమ గేయ రచయిత గా సిరివెన్నెల సీతా రామశాస్త్రి (సై రా), ఉత్తమ సంభాషణల రచయిత గా బుర్రా సాయి మాధవ్ ( సై రా), ఉత్తమ చిత్రం గా జెర్సీ ఎంపికై పురస్కారాలు స్వీకరించారు. ప్రత్యేక జ్యూరీ పురస్కారాలను నిత్యా శెట్టి (ఓ పిట్టకథ ), సత్యదేవ్ (బ్రోచే వారెవరురా ), అనిల్ రావిపూడి (ఎఫ్ 2), దిల్ రాజు (సరిలేరు నీకెవ్వరూ) గెలుచుకున్నారు.
2020 పురస్కార గ్రహీతలు
ఉత్తమ హీరో హీరోయిన్లుగా అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో), రష్మిక మంథాన (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ సంచలన హీరో హీరోయిన్లుగా సుధీర్ బాబు (వి), పాయల్ రాజపుత్ (డిస్కో రాజా) ఉత్తమ చిత్రం గా (అల వైకుంఠపురములో), ఉత్తమ సంచలన దర్శకుడిగా వెంకీ కొడుముల (భీష్మ) ఎంపికై అవార్డులు అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్లుగా మురళీ శర్మ (అల వైకుంఠపురములో), విజయ శాంతి (సరిలేరు నీకెవ్వరు), ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్(అల వైకుంఠపురములో), ఉత్తమ విలన్ గా సునీల్ (కలర్ ఫోటో), ఉత్తమ హాస్య నటులుగా వెన్నెల కిషోర్ (భీష్మ), ఉత్తమ గేయ రచయిత గా రామ జోగయ్య శాస్త్రి (అల వైకుంఠ పురం లో), ఉత్తమ గాయనీ గాయకులుగా మధు ప్రియ (సరిలేరు నీకెవ్వరు), అర్మాన్ మాలిక్ (అల వైకుంఠపురములో), ఉత్తమ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ (అల వైకుంఠపురములో) పురస్కారాలు కైవసం చేసుకున్నారు.
![]() |
![]() |