![]() |
![]() |

'శివ'(1989) వంటి ట్రెండ్ సెట్టర్ తరువాత ఎవర్ గ్రీన్ సెన్సేషన్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తెలుగు చిత్రం `క్షణక్షణం`. విక్టరీ వెంకటేశ్, అతిలోక సుందరి శ్రీదేవి తొలి కలయికలో తెరకెక్కిన ఈ రోడ్ థ్రిల్లర్.. క్లాస్ ఆడియన్స్ ని భలేగా ఎంటర్టైన్ చేసింది. అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకున్న చిరుద్యోగి సత్య (శ్రీదేవి).. చిరుదొంగ చందు (వెంకటేశ్) సహాయంతో ఎలా బయటపడింది? అనేదే `క్షణక్షణం` చిత్ర కథాంశం. స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నప్పటికీ.. చిత్ర కథనం, నటీనటుల అభినయం, దర్శకత్వ ప్రతిభ, సంగీతం, ఇతర సాంకేతిక విలువలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి.
ప్రజాదరణ పొందడమే కాకుండా ఉత్తమ నటి (శ్రీదేవి), ఉత్తమ దర్శకుడు (రామ్ గోపాల్ వర్మ), ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ (రామ్ గోపాల్ వర్మ), ఉత్తమ ఛాయాగ్రాహకుడు (ఎస్. గోపాల్ రెడ్డి), ఉత్తమ ఎడిటర్ (శంకర్) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `ఉత్తమ నటి`, `ఉత్తమ సంగీత దర్శకుడు` (కీరవాణి) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం.
ఇక పాటల విషయానికి వస్తే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో ఎస్పీ బాలు, చిత్ర గానం చేసిన ``జామురాతిరి జాబిలమ్మ`` ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలవగా.. ``కో అంటే కోటి``, ``అందనంత ఎత్తా``, ``అమ్మాయి ముద్దు``, ``జుంబాయి`` గీతాలు కూడా రంజింపజేశాయి. వీటిలో ``కో అంటే కోటి``ని బాలుతో కలిసి కథానాయిక శ్రీదేవి గానం చేయడం విశేషం. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, వై. లక్ష్మణ చౌదరి నిర్మించిన `క్షణక్షణం`.. 1991 అక్టోబర్ 9న విడుదలైంది. నేటితో ఈ మ్యూజికల్ థ్రిల్లర్ 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |