![]() |
![]() |

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్'. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శుక్రవారం సాయంత్రం(అక్టోబర్ 8న) నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగ చైతన్య, హరీష్ శంకర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పూజా హెగ్డే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మనమందరం లాక్డౌన్ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదని హరీష్ శంకర్ తెలిపారు. పూజా హెగ్డే ఇప్పుడు చాలా బిజీ అయింది అని.. ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదరుచూస్తుంటారు.. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అఖిల్, పవన్ కళ్యాణ్, బన్నీ, ప్రభాస్ ఇలా అందరి సరసన పూజా హెగ్డే నటిస్తుందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.
హరీష్ శంకర్ మాటల్లో పవన్ కళ్యాణ్ తో కూడా పూజా హెగ్డే నటిస్తోందంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ మాటలను బట్టి చూస్తే ఆ ప్రచారంలో నిజముందని అర్థమవుతోంది. కాగా, హరీష్ శంకర్ గత రెండు చిత్రాలు దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ లో కూడా పూజా హెగ్డే నటించడం విశేషం.
![]() |
![]() |