![]() |
![]() |

యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన ప్రేమకథా చిత్రాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. వాటిలో `ప్రేమమ్` ఒకటి. మలయాళంలో ఘనవిజయం సాధించిన `ప్రేమమ్`కి రీమేక్ వెర్షన్ గా రూపొందిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ నాయికలుగా నటించారు. చైతూకి నాన్నగా కింగ్ నాగార్జున, మేనమామగా విక్టరీ వెంకటేశ్ నిజజీవిత పాత్రల్లో కాసేపు కనిపించి అలరించారు. అరవింద్ కృష్ణ, చైతన్య కృష్ణ, ప్రవీణ్, బ్రహ్మాజీ, వైవా హర్ష, ఈశ్వరీ రావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. చందు మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
కథాంశం విషయానికి వస్తే.. వేర్వేరు దశల్లో విక్రమ్ (నాగచైతన్య) అనే యువకుడి ప్రేమకథల సమాహారంగా `ప్రేమమ్` తెరకెక్కింది. సుమ (అనుపమ పరమేశ్వరన్), సితార (శ్రుతి హాసన్), సింధు (మడోన్నా సెబాస్టియన్) అనే ముగ్గురు అమ్మాయిలు విక్రమ్ జీవితంలో ఎలాంటి పాత్ర పోషించారు? చివరకి విక్రమ్ ఎవర్ని పెళ్ళాడాడు? అనేదే సినిమాలో కీలకాంశం.
`ప్రేమమ్`కి రాజేశ్ మురుగేశన్, గోపీసుందర్ అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటల్లో ``ఎవరే ఎవరే`` విశేషాదరణ పొందగా.. మిగిలిన గీతాలు కూడా సందర్భానుసారంగా రూపొంది యువతరాన్ని రంజింపజేశాయి. 2016 అక్టోబర్ 7న విజయదశమి కానుకగా విడుదలై జననీరాజనాలు అందుకున్న `ప్రేమమ్`.. నేటితో ఐదు వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |