![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. వాటిలో `జయం మనదేరా!` ఒకటి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహదేవ నాయుడు, అభిరామ్ అలియాస్ రుద్రమ నాయుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించారు వెంకీ. అలాగే తన నటనకు గానూ `బెస్ట్ యాక్టర్`గా `ఫిల్మ్ ఫేర్` అవార్డ్ సైతం సొంతం చేసుకున్నారు. వెంకీకి జంటగా భానుప్రియ, సౌందర్య నటించిన ఈ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి, అతుల్ కులకర్ణి, బ్రహ్మానందం, అలీ, ఝాన్సీ, భరణి, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, ఎల్బీ శ్రీరామ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, వెన్నిరాడై నిర్మల, హేమ, ప్రియ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎన్. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మించారు.
`వందేమాతరం` శ్రీనివాస్ స్వరకల్పనలో రూపొందిన గీతాలన్నీ విశేషాదరణ పొందాయి. ``మెరిసేటి జాబిలి నీవే`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``హ్యాపీగా జాలీగా``, ``డోన్ట్ మిస్``, ``హిందుస్థాన్ లో``, ``చిన్ని చిన్ని``, ``పెళ్ళికి బాజా`` వంటి పాటలు కూడా ఆకట్టుకున్నాయి. 104 కేంద్రాలలో 50 రోజులు, 34 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమైన `జయం మనదేరా`.. ఫుల్ రన్ లో దాదాపు రూ.12 కోట్ల షేర్ ఆర్జించి అప్పట్లో వార్తల్లో నిలిచింది. తమిళంలో ఈ సినిమా `మణికంఠ` (అర్జున్, జ్యోతిక, ఉమ) పేరుతో రీమేక్ అయింది. 2000 అక్టోబర్ 7న విజయదశమి కానుకగా విడుదలై అఖండ విజయం సాధించిన `జయం మనదేరా`.. నేటితో 21 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |