![]() |
![]() |

'మంచు ఫ్యామిలీ' అంటూ ప్రకాశ్‌రాజ్ తన కుటుంబం మీద ఆరోపణలు చేయడంపై మంచు విష్ణు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. రానున్న మా ఎన్నికల్లో మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్‌బాబు పోస్టల్ బ్యాలెట్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ప్రెస్‌మీట్ పెట్టి ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. దీనికి ప్రతిగా తన ప్యానల్ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడిన విష్ణు, ఇంకోసారి తన ఫ్యామిలీ పేరు తీస్తే మర్యాద దక్కదని ప్రకాశ్‌రాజ్‌ను హెచ్చరించారు.
"ప్రకాశ్‌రాజ్ గారూ.. ఇంకోసారి నా ఫ్యామిలీ పేరు తీస్తే.. మీకు గారు అనేది ఇక ఉండదు. ప్రెసిడెంట్ క్యాండిడేట్‌ను నేను. మీకు దమ్ము, సత్తా ఉంటే, మీరు మగాడిననుకుంటే నా పేరే తీయండి. మా అక్క, తమ్ముడు, నాన్న పేరు, నా ఫ్యామిలీ అని నా మదర్‌నీ, నా వైఫ్‌నీ, నా పిల్లల్నీ లాక్కండి. కాస్తయినా సిగ్గు, మర్యాద ప్రదర్శించండి. మీకు మర్యాదనేది లేదా? మంచు ఫ్యామిలీ అని ఎందుకు మాట్లాడతారు? మీ ఫ్యామిలీ గురించీ, మీ ఫ్యామిలీ లైఫ్ గురించీ మాట్లాడాలా నేను?" అని ప్రశ్నించారు విష్ణు.
"నా కోసం మా నాన్న, అక్క, తమ్ముడు ఫోన్లు చేసి ఓటేయమని అడుగుతారు. రేపు నా భార్య ఫోన్ చేయొచ్చు. దాంట్లో తప్పేంటి? మా ప్యానల్ తరపున జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న రఘుబాబు వాళ్ల నాన్న గిరిబాబు గారికి ఫోన్‌చేసి మీకు ఓటేయమని అడుగుతారు. అక్కడే మీ సంస్కారం ఏమిటనేది అర్థమవుతోంది. అప్పుడు ఆయనిచ్చిన క్లాస్ మీకు సరిపోతుంది. నా ఫ్యామిలీ పేరు ఇంకోసారి తీస్తే ఎవరికీ మర్యాద ఉండదు." అని ఆయన హెచ్చరించారు.
"అవతలి ప్యానల్‌లో ఉన్న శ్రీకాంత్, హేమ, బెనర్జీ లాంటి 90 శాతం మంది నాకు ఇష్టమైనవాళ్లే. 10వ తేదీ తర్వాత మేమంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి. ప్రకాశ్‌రాజ్ 10వ తేదో, 11వ తేదో ఫ్లైటెక్కి వాళ్లింటికి వెళ్లిపోతాడు. మీరందరూ దయచేసి ఒళ్లు దగ్గరపెట్టుకొని పెద్దలకు మర్యాద ఇవ్వండి. మీ తోటి నటీనటులకు మర్యాదనివ్వండి. మనమందరం ఒక ఫ్యామిలీ. 10వ తేదీ తర్వాత మీరంతా నోరు జారితే, 11 తర్వాత మనమందరం మొహాలు చూసుకోలేం. ఒక ఫ్యామిలీని విడగొట్టకండి. మనమంతా ఒకటి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీ." అని చెప్పారు విష్ణు.
"నేను హీరోగా వచ్చినప్పుడు వచ్చిన కొంతమంది యంగ్ యాక్టర్లు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. అన్ని వయసులవారికీ మా అవసరం. ప్రకాశ్‌రాజ్ గారూ మీ పొలిటికల్ అజెండా ఇక్కడ తీసుకురాకండి. జీవిత గారూ.. మీరు మా నాన్నగారి పేరు సంబోధించకండి. మీకు ఆ హక్కు లేదు. మా నాన్నగారి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు?" అని ప్రశ్నించారు.
"ప్రకాశ్‌రాజ్ గారూ.. శ్రీహరి అంకుల్ కానీ ఉండుంటే ఈరోజు మీకు తగ్గట్లు గుణపాఠం నేర్పించేవాడు. మీకు తగ్గట్లు నేను కాదు, ఆయనే చెప్పేవాడు. ఆయన కరెక్ట్ మీకు ఆన్సర్ చేయడానికి. శ్రీహరి అంకుల్ మిమ్మల్ని నాన్నగారి దగ్గరకు తీసుకువస్తే, మీరు నాన్నగారి కాలు తాకింది మర్చిపోయారా? 'వస్తాడు నా రాజు' సినిమాకు నేను ప్రొడ్యూసర్‌ని, హీరోని. నా డైరెక్టర్‌ని పదిమందిలో మీరు దుర్భాషలాడారు." అని ఆరోపించారు విష్ణు.
![]() |
![]() |