![]() |
![]() |

శేఖర్ కమ్ముల లేటెస్ట్ హిట్ ఫిల్మ్ 'లవ్ స్టోరి'లో నటిస్తున్నంతసేపూ నిద్రలేని రాత్రులు గడిపానని అంటున్నారు రాజీవ్ కనకాల. ఆ మూవీలో ఆయన హీరోయిన్ సాయిపల్లవి బాబాయ్ నరసింహంగా నటించారు. చిన్నతనంలోనే మౌనిక (సాయిపల్లవి)ను లైంగిక వేధింపులకు గురిచేసే పాత్ర ఆయనది. అందుకే ఆ పాత్రను భయపడుతూనే ఆయన చేశారు. హీరోయిన్ బాబాయ్‌గా కాకుండా మేనమామ పాత్రగా దానిని మార్చమని ఆయన శేఖర్ కమ్ములను బతిమలాడుకున్నారు కూడా. ఈ విషయాలను ఆయన తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
శేఖర్ కమ్ముల ఆ క్యారెక్టర్ గురించి ఎగ్జయిట్ అవుతూ మంచి విలన్ క్యారెక్టర్ అని చెప్పారు. "నేను చాలా సినిమాల్లో చేసినటువంటి విలన్ క్యారెక్టరే కదా అనుకున్నాను. అయితే ఆ పాత్రకు సంబంధించి సినిమాలోని కీలకమైన పాయింట్‌ను ఆయన మొదట నాకు చెప్పలేదు. ఒకసారి సీన్ చేసేటప్పుడు, మీకొక ఫ్లాష్‌బ్యాక్ ఉంది సార్. దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ ఇక్కడి ఎక్స్‌ప్రెషన్‌లో రావాలి సార్ అని చెప్పారు. అదేంటని అడిగాను. చైల్డ్ మాలిస్టేషన్ అని చెప్పారు. దాంతో షాకయ్యాను" అని చెప్పారు రాజీవ్.
అలాంటి ఘటనలు ప్రతిచోటా జరుగుతున్నప్పటికీ తన పాత్ర అలాంటిదని తెలిసినప్పుడు ఆయన జీర్ణం చేసుకోలేకపోయారు. "నా క్యారెక్టర్‌లో చైల్డ్ మాలిస్టేషన్ ఉంటుందని చెప్పినప్పుడు నాకు ఎక్కలేదు. ఎందుకంటే అది బాబాయ్ క్యారెక్టర్. తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. కాదు సార్.. కనీసం బాబాయ్‌ని మావయ్యగానైనా మార్చండి అని అడిగాను. లేదు లేదు.. ఇప్పుడు జరుగుతున్న వాస్తవం ఇది. బాబాయ్‌లే కాదు తండ్రులే అలాంటి పనులు చేస్తున్నారు అన్నారాయన. దాంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాను." అని ఆయన తెలిపారు.
ఎప్పుడు లొకేషన్‌కు వెళ్లినా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లకు ఆ క్యారెక్టర్‌ను మావయ్య కింద మార్చమని శేఖర్‌కు చెప్పండంటూ అడుగుతూ వచ్చారు రాజీవ్. "ఇలాంటివి జరుగుతున్న వాస్తవాలే కానీ.. వాటిని సినిమాలో చూపిస్తే, చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎక్కువమంది చదువుకున్నవాళ్లు ఉంటారు కాబట్టి హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు మీరు చాలా బాగా చేశారండీ అంటున్నారు. అదే నేను బీ, సీ సెంటర్లకు వెళ్లాననుకోండి.. నన్ను చెప్పులతో, రాళ్లతో కొడతారు. వాళ్లు ఆ క్యారెక్టర్‌ను నిజమనుకొని, నన్ను అలాంటివాడే అనుకుంటారు. దే టేకిట్ సో బ్యాడ్‌లీ." అని చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల.
![]() |
![]() |