![]() |
![]() |

చైల్డ్ సెంటిమెంట్ ప్రధానాంశంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని చిత్రాలు చేశారు. వాటిలో `పసివాడి ప్రాణం` (1987) తెలుగునాట పలు రికార్డులు సృష్టించగా.. మరో చిత్రం `డాడీ` (2001) నటుడిగా చిరంజీవికి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చింది. ఈ రెండు సినిమాలను కూడా గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ నిర్మించడం విశేషం. వీటిలో `డాడీ` చిత్రం కోసం పూర్తి స్థాయి తండ్రి పాత్రలో నటించి ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు చిరు. సురేశ్ కృష్ణ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మెగాస్టార్ కి జంటగా సిమ్రన్, ఆషిమా భల్లా నటించగా రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, అచ్యుత్, శరత్ బాబు, ఎమ్మెస్ నారాయణ, ఉత్తేజ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో టీనేజ్ డ్యాన్సర్ గా ఓ చిన్న పాత్రలో మెరిశారు.
ఎస్.ఎ. రాజ్ కుమార్ బాణీలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, చంద్రబోస్, భువనచంద్ర, శ్రీనివాస్ సాహిత్యమందించారు. ``మందార బుగ్గల్లో``, ``గుమ్మాడి గుమ్మాడి``, ``నా ప్రాణమా``, ``వానా వానా``, ``ఆడు ఆడించు``, ``పట్టా పక్కింటి`.. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. 97 కేంద్రాలలో 50 రోజులు, 15 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమైన `డాడీ`.. 2001 అక్టోబర్ 4న జనం ముందు నిలిచింది. నేటితో ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 20 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |