![]() |
![]() |

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. ముంబై సముద్ర తీరంలో ఓ క్రూయిజ్‌లో శనివారం రేవ్, డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలుసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. కొందరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ప్రముఖ హీరో తనయుడు ఉన్నాడని శనివారమే వినిపించింది. అతడు షారుక్ కుమారుడా? లేదంటే సైఫ్ అలీ ఖాన్ కుమారుడా? అని కొంత సందిగ్ధం నెలకొంది. ఆదివారం ఉదయం ఆ సందేహాలకు ఎన్‌సిబి అధికారులు తెర దించారు.
క్రూయిజ్‌లో డ్రగ్స్ దాడుల తర్వాత ఆర్యన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌సిబి అధికారి సమీర్ వాఖండే ధ్రువీకరించారు. అతడి మీద ప్రస్తుతానికి ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం ఫోన్ సీజ్ చేశారట. నేడు ఆర్యన్ ఖాన్‌ను విచారించనున్నారు. అతడితో పాటు మొత్తం పదిమందిని అదుపులోకి తీసుకున్నారట. అందులో నటుడు అర్భాజ్ మర్చంట్ కూడా ఉన్నాడు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ బయటపడిన వాళ్ళతో పోలిస్తే... టాప్ స్టార్ షారుక్ కుమారుడు ఆర్యన్ పేరు రావడంతో ముంబై ఇండస్ట్రీలో మరింత టెన్షన్ పెరిగింది. ప్రేక్షకులలో కూడా ఇంకెవరు బయటపడతారోనని ఆసక్తికర చర్చ జరుగుతోంది.
![]() |
![]() |