![]() |
![]() |

సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'రిపబ్లిక్'. అక్టోబర్ 1 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ చూసిన టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
ఆదివారం సాయంత్రం ఎంపీ రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏఎంబి సినిమాస్ లో 'రిపబ్లిక్' చిత్రాన్ని ప్రత్యేక స్క్రీనింగ్‌లో వీక్షించారు. స్క్రీనింగ్ లో డైరెక్టర్ దేవ కట్టా, సింగర్ స్మిత కూడా ఉన్నారు. సినిమా చూసిన రేవంత్ రెడ్డి, సీతక్క చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ప్రజాస్వామ్య విలువలపై రూపొందించిన చిత్రం ఆకట్టుకుందని.. యువత తప్పకుండా ఈ సినిమాను చూడాలని రేవంత్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని.. ఏ ఉద్దేశంతో అయితే దర్శకుడు ఈ చిత్రాన్ని తీశారో అది నెరవేరుతుందని భావిస్తున్నాను అన్నారు. ఈ సినిమా చూసి కొందరిలో అయినా మార్పు వస్తుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన 'రిపబ్లిక్' సినిమాలో సాయి తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు.
![]() |
![]() |