![]() |
![]() |

తమిళ్ లో పలు చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను అలరిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ.. ఇతర భాషల్లోనూ పలు భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'రామ్ సేతు', జాన్వీ కపూర్ కథానాయికగా 'గుడ్ లక్ జెర్రీ' సినిమాలతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న లైకా.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఓ సినిమా చేయడానికి సిద్ధమైంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు సుభాస్కరన్, మహవీర్ జైన్ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించనున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ ‘3’తో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమైన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ‘వెయ్ రాజా వెయ్’ సినిమా చేశారు. ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమా, తెలుగులో చేయడానికి ఐశ్వర్య సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుంది.
ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. "లైకా ప్రొడక్షన్స్‌లో ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది" అని తెలిపారు.
లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. "మా సంస్థలో తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకుంది" అన్నారు.
కాగా, ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
![]() |
![]() |