![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో పలు రీమేక్ సెన్సేషన్స్ ఉన్నాయి. వాటిలో `సుందరకాండ`కి ప్రత్యేక స్థానం ఉంది. తమిళ చిత్రం `సుందర కాండం` (కె. భాగ్యరాజ్) ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో.. ఆదర్శభావాలు ఉన్న జూనియర్ కాలేజ్ తెలుగు లెక్చరర్ వెంకటేశ్వర్లు గా తనదైన అభినయంతో అలరించారు వెంకీ. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో వెంకీకి జంటగా మీనా, అపర్ణ నటించగా బ్రహ్మానందం, గొల్లపూడి, కోట శ్రీనివాసరావు, మల్లికార్జున రావు, నిర్మలమ్మ, వైజాగ్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. దిగ్గజ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలువారిన ``ఆకాశాన సూర్యుడుండడు`` (రెండు వెర్షన్స్) ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అలాగే ``ఉలికి పడకు``, ``సుందరకాండకు``, ``అరె మామ``, ``ఇంకా ఇంకా`` గీతాలు కూడా రంజింపజేశాయి. సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కేవీవీ సత్యనారాయణ నిర్మించిన `సుందరకాండ`.. గాంధీజయంతి కానుకగా 1992 అక్టోబర్ 2న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ క్లాసిక్ 29 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |