![]() |
![]() |

`వర్షం` (2004)తో తొలి బ్లాక్ బస్టర్ కొట్టినా.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మొదటిసారిగా నటించిన `ఛత్రపతి`(2005) చిత్రంతోనే స్టార్ డమ్ చూశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ``తన కోసం బ్రతికేవాడు మనిషి.. ప్రజల కోసం బ్రతికేవాడు ఛత్రపతి`` అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో తనదైన అభినయంతో మెస్మరైజ్ చేశారు ప్రభాస్. అటు యాక్షన్ సీన్స్ లోనూ.. ఇటు మదర్ సెంటిమెంట్ సీన్స్ లోనూ రాణించారు. ప్రభాస్ కి జోడీగా శ్రియ నటించిన ఈ సినిమాలో భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, అజయ్, సుప్రీత్, వేణుమాధవ్, జయప్రకాశ్ రెడ్డి, అనితా చౌదరి, నరేంద్ర ఝా, ఎల్బీ శ్రీరామ్, శేఖర్, మాస్టర్ మనోజ్ నందం, మాస్టర్ తేజ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా ఆర్తి అగర్వాల్, ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతాల్లో కనువిందు చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్వరవాణి కీరవాణి బాణీలు, నేపథ్య సంగీతం `ఛత్రపతి`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``నల్లనివన్నీ నీళ్ళని``, ``ఎ వచ్చి బి పై వాలే``, ``గుండు సూది``, ``గల గల``, ``అగ్ని స్ఖలన``, ``మన్నేలా తింటివిరా``, ``సుమ్మ మాసూరియా``.. ఇలా ఇందులోని గీతాలన్ని ప్రజాదరణ పొందాయి. `ఉత్తమ సహాయనటి` (భానుప్రియ), `ఉత్తమ సంగీత దర్శకుడు` విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకున్న `ఛత్రపతి`.. బెంగాలీలో ``రెప్యూజీ` (2006) పేరుతో, కన్నడంలో `ఛత్రపతి` (2013) టైటిల్ తో రీమేక్ అయింది. ప్రస్తుతం హిందీలో ఈ చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా స్టార్ కెప్టెన్ వీవీ వినాయక్ రీమేక్ చేస్తున్నారు. 2005 సెప్టెంబర్ 30న విడుదలై ప్రభంజనం సృష్టించిన `ఛత్రపతి`.. నేటితో 16 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |