![]() |
![]() |

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గం దగ్గర బైక్ ప్రమాదానికి గురై, తీవ్ర గాయాల పాలయిన హీరో సాయిధరమ్ తేజ్, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ విరగడంతో పాటు ఛాతీపై, కుడికన్నుపై గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో మా అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఆయన మాట్లాడిన తీరును పలువురు తప్పుపడుతున్నారు.
నరేశ్ మాట్లాడుతూ, "సాయిధరమ్ తేజ్, మా అబ్బాయి నవీన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సొంత బ్రదర్స్‌లా ఉంటారు. ప్రమాదం జరిగిన రోజు ఇద్దరూ మా ఇంటి దగ్గర్నుంచే బయల్దేరి వెళ్లారు. ఆపుదామనుకొనే లోగా వెళ్లిపోయారు. నాలుగైదు రోజుల క్రితం కూడా వాళ్లకు కౌన్సిలింగ్ చేద్దామనుకున్నాను. పెళ్లి చేసుకొని కెరీర్‌లో సెట్ అవ్వాల్సిన మంచి వయసులో ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో ఇలాంటి రిస్కులు ఎవరూ తీసుకోకుండా ఉండటం మంచిది." అని అన్నారు.
తను కూడా ఒకప్పుడు బైక్ ప్రమాదానికి గురయ్యాననే విషయం ప్రస్తావిస్తూ, "నేను కూడా ఇదివరకు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మా అమ్మ నాతో ఒట్టు వేయించి, నాతో బైక్‌లు మాన్పించింది. ఇదివరకు కోట శ్రీనివాసరావు గారబ్బాయి, బాబూమోహన్ గారబ్బాయి, కోమటిరెడ్డి గారబ్బాయి.. వీళ్లందరూ బైక్ ప్రమాదానికి గురై కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచెత్తి వెళ్లిపోయారు." అని గుర్తుచేశారు నరేశ్. "రానున్న రోజుల్లో మనందరం నిర్మాతలు, కుటుంబం శ్రేయస్సుకోరి ఈ బైకులు ముట్టుకోకుండా ఉండటం మంచిది" అని సూచించారు.
ఇలా ఆయన ఎవరూ బైకులు నడపవద్దని చెప్పడం, బైక్ ప్రమాదాల్లో మృతి చెందిన వారిని ప్రస్తావించడం కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ఒకవైపు సాయితేజ్ బైక్ ప్రమాదానికి గురై, హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంటే, ఆయన క్షేమాన్ని కోరుతూ మాట్లాడాలి కానీ, తమ ఇంటి నుంచే ఆ రోజు బయలుదేరారని చెప్పడం, కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నాననడం, బైకులు ముట్టుకోవద్దని చెప్పడం ఏంటని నటులు శ్రీకాంత్, బండ్ల గణేశ్ విమర్శించారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు.
![]() |
![]() |